
విజయనగరం టౌన్ : మరో రెండు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటాడనుకున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గంట్యాడ మండలానికి చెందిన బంటుపల్లి కృష్ణ (25) స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఎస్‌వీఎన్ హోటల్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే విధులకు హాజరయ్యేందుకు తన బైక్‌పై వేకువజామునే బయలుదేరిన కృష్ణ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు వచ్చేసరికి అభివృద్ధి పనుల నేపథ్యంలో చుట్టూ రాళ్లు పేర్చి ఉండడంతో పక్కకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్‌గేట్‌లోకి వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కృష్ణను ఆటోలో కేంద్రాస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి తల్లిదండ్రులు బంటుపల్లి ఎర్నాయుడు, రమణమ్మ ఉన్నారు. ఆదుకుంటాడునుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నాడు. ట్రాఫిక్ ఎస్సై ఎ. మహేశ్వరరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చేపలవేటకు వెళ్లి ..
గజపతినగరం రూరల్: మండల కేంద్రంలోని కుమ్మరవీధికి చెందిన మూడళ్ల రాము చెరువులో పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..రాము ఆదివారం రాత్రి నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో వెతుకుతుండగా, మల్లపుచెరువులో రాము మృతదేహం కనిపించింది. చేపల పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య పైడిరాజు, కుమారుడు రామకృష్ణ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజపతినగరం కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. హెడ్‌కానిస్టేబుల్ పెదమజ్జి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని యువకుడు..
నెల్లిమర్ల : పట్టణ పరిధిలో రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం స్థానిక పూడమ్మతల్లి వనుంగుడి సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు కనుగొని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుందని, నీలంరంగు లోయర్, అకుపచ్చరంగు షర్టు ధరించి ఉన్నట్లు రైల్వేహెడ్ కానిస్టేబుల్ చిరంజీవిరావు తెలిపారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించామని, ఆచూకీ తెలిసినవారు 94414 68123 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.
విద్యుదాఘాతంతో ఒకరు..
విజయనగరం టౌన్: పట్టణంలోని కలువుపువ్వు మేడ వద్ద గల సూర్యనగర్ శ్రీసాయి రెసిడెన్సీ ఎస్–3లో నివాసముంటున్న తూర్పాటి రమేష్‌కుమార్ (41) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వన్‌టౌన్ పోలీసులందించిన వివరాలిలా ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న షూమార్ట్‌లో ట్రైనీగా పనిచేస్తున్న రమేష్‌కుమార్ ఆదివారం రాత్రి తన ఇంట్లో భోజనం చేసిన తర్వాత కంచంలో మిగిలిన నీటిని అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కిందకు విసిరే ప్రయత్నంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు కంచం తగలడంతో విద్యుదాఘాతంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య రాజేశ్వరి , పిల్లలు చైతన్య, సాహితీ ఉన్నారు. రమేష్‌కుమార్ సొంత ఊరు గంట్యాడ మండలం బోనంగి గ్రామం కాగా, ఉద్యోగరిత్యా విజయనగరంలో ఉంటున్నారు. వన్‌టౌన్ ఎస్సై గోపాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.