ఉన్మాది పనేనా
సంచలనం రేకెత్తించిన చేబ్రోలుజంట హత్యలు
చేబ్రోలు (ఉంగుటూరు) : చేబ్రోలులో సోమవారం తెల్లవారుఝామున జరిగిన జంట హత్యలు సంచలనాన్ని రేకెత్తించాయి. గ్రామంలో జాతీయ రహదారి పక్కన గుడి ఆవరణలో ఆదమరిచి నిద్రిస్తున్న ఓ యాచకురాలు, చిరుద్యోగిని బండరాతితో మోది ఓ ఉన్మాది కిరాతక చర్యకు ఒడిగట్టాడు. అయితే ఎప్పటినుంచో ఇక్కడే తిరుగాడే ప్రేమ అనే హిజ్రా ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఇక్కడ తచ్చాడుతూ ‘నలుగురు రౌడీలు తిరుగుతున్నారు.. జాగ్రత్తగా ఉండండి’ అంటూ స్థానికులతో చెప్పిన హిజ్రా ఈ ఘటన తరువాత అదృశ్యం కావడంతో పోలీసులు పలు చోట్ల గాలిస్తున్నారు.
సోమవారం ఉదయం జంట హత్యల సమాచారాన్ని అందుకున్న ఎస్పీ రఘురామ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, గుడి ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. యాచకురాలు పార్వతిని బండతో మోది చంపి, మృతదేహాన్ని గుడి వెనుకకు ఈడ్చుకెళుతుండగా అలికిడికి లేచిన చిరుద్యోగి ఏసుబాబు తమను ఎక్కడ గుర్తు పడతాడోననే భయంతోనే అతనిని కూడా బండరాతితో దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హిజ్రా కాకపోతే గ్రామానికి తరచుగా వచ్చి పోయేవారి పనే అయి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఐదేళ్లుగా ఇదే ప్రాంతంలో యాచిస్తున్న దామాల పార్వతిది విజయనగరం జిల్లా. తన కుమార్తెకు పెళ్లి చేయాలని తరచూ గ్రామస్తులతో అంటూ ఉండేదని, కూడబెట్టిన డబ్బును నెలకోసారి వెళ్లి కుమార్తెకు ఇస్తుండేదని గ్రామస్తులు చెబుతున్నారు.
మొదటి నెల జీతం ఇచ్చాడు
నెలన్నర క్రితమే హైవే పెట్రోలింగ్ వాహనం సహాయకుడిగా చేరిన ఏసుబాబు రెండు రోజుల క్రితమే తన మొదటి నెల జీతాన్ని తల్లికి ఇచ్చాడు. కుటుంబానికి ఆసరాగా ఎదిగిన కొడుకు అంతలోనే దూరం కావడంతో ముసలి తల్లిదండ్రులు బొబ్బిలి వెంకటేశ్వరరావు, మంగతాయారు ఆవేదన అంతా ఇంతా కాదు. అతను నివాసం ఉంటున్న సాయిరామ్‌పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏసుబాబు అన్న త్రిమూర్తులు, వారి మేనకోడలు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం చూపరులను కంటతడిపెట్టించింది.
ఇంటికి వెళ్లినా.. హోటల్ లో నిద్రించినా బతికేవాడేమో..
ఆదివారం రాత్రి ఏసుబాబు విధులకు ఆలస్యంగా రాగా అప్పటికే హైవే పెట్రోలింగ్ వాహనం మిగిలిన సిబ్బందితో వెళ్లిపోయింది. అనంతరం రాత్రి 12గంటలకు వాహనం తణుకు నుంచి తిరిగొచ్చింది. అక్కడే ఉన్న ఏసుబాబును ఇంటికి వెళ్లి ఉదయమే రావాలని పెట్రోలింగ్ డ్రైవర్ మారిశెట్టి రవి కోరాడు. దీనికి నిరాకరించగా, వాహనం తాళాలు ఇచ్చి డ్రైవర్ రవి, మిగిలిన సిబ్బంది కొంత దూరంలో ఉన్న హోటల్‌లో నిద్రించేందుకు వెళ్లిపోయారు. వాహనంలో సీటును తెచ్చుకొని ఆలయం అరుగుపై యాచకురాలు పార్వతికి సమీపంలో ఏసుబాబు నిద్రించాడు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి నా, లేక తమతో పాటు హోటల్‌లో నిద్రించేందుకు వచ్చినా బతికేవాడంటూ డ్రైవర్ రవి, ఇతర సిబ్బంది వాపోయారు. అర్ధరాత్రి వరకు తమతో ఉన్న ఏసుబాబు హత్యకు గురికావడంతో కన్నీటి పర్యంతమయ్యారు.