‘ఒక పోలీసు-ఒక దొంగ’ | 'A police-a thief' | Sakshi
Sakshi News home page

‘ఒక పోలీసు-ఒక దొంగ’

Published Sat, Nov 22 2014 3:34 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

'A police-a thief'

అనంతపురం క్రైం : దొంగల్లో మానసిక పరివర్తన తీసుకురాగలిగితే కొంతలో కొంతైనా నేరరహిత సమాజాన్ని నిర్మించవచ్చననే అభిప్రాయంతో ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘ఒక దొంగ-ఒక పోలీసు’  వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొత్తం దొంగల జాబితా సిద్ధం చేయించి ప్రతి దొంగకు ఒక పోలీస్‌ను కేటాయించి వారిని నిత్యం సంస్కరించేలా విధులు అప్పగిస్తూ తయారు చేసిన పుస్తకాన్ని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఎస్పీ  విడుదల చేశారు.

ఈ సందర్భంగా ‘ఒక దొంగ-ఒక పోలీసు’ కార్యక్రమంపై మాట్లాడారు. పుట్టుకతోనే ఎవరూ దొంగలు కారన్నారు.  పేదరికం, నిరక్షరాస్యత, సరిపడే సంపాదన లేకపోవడం, విలాసాలకు అలవాటు పడడం, విచక్షణా పరిజ్ఞానం లేకపోవడం తదితర కారణాల వల్ల  దొంగలు, నేరస్తులుగా మారుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులు కుటుంబానికి, ఇటు సమాజానికి భారమవుతారన్నారు. చివరకు వారు కూడా ప్రశాంతత కోల్పోయి పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతుంటారన్నారు.

దొంగతనం ఎప్పటికీ  దాగదన్నారు. ఏదో ఒకరోజు బయటపడుతుందని, ఆర ోజు ఊసలు లెక్కించాల్సి వస్తుందన్నారు. మరోవైపు సొమ్ము పోగొట్టుకున్న బాధితుల ఆవేదన చెప్పలేదన్నారు. బిడ్డ పెళ్లికోసమో, పిల్లల చదువుల కోసమో, ఇంటి అవసరాలకో, వైద్యఖర్చులకో అప్పులు చేసి దాచుకున్న సొమ్మును దొంగలిస్తే వారు ఎంతటి  బాధను అనుభవిస్తారో  ఊహించలేమన్నారు. ఈ క్రమంలోనే దొంగల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్రాను.

 జిల్లాలో 2500 మంది దొంగలు : సీసీఎస్ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో దొంగల జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 2500 మంది దొంగలున్నట్లు గుర్తించారు. వీరిలో ఐదు, అంతకంటే ఎక్కువనేరాలు పాల్పడిన వారు 130 మందికాగా, మిగిలినవారు ఐదులోపు నేరాలు చేసినవారే. వీరికి ఏఎస్‌ఐ నుంచి హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల వరకూ ఒక్కొక్కరినీ కేటాయించారు. నిత్యం నిఘా ఉంచడంతోపాటు దొంగల ప్రవర్తనపై దృష్టిసారిస్తారు.

దొంగలను దొంగలుగా చూడకుండా వారిలో పరివర్తన తెచ్చేందుకు అందరం కృషి చేద్దామని ఎస్పీ పిలుపునిచ్చారు.  ‘దొంగల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తాం’ అని పోలీసులు, ‘దొంగతనాలు మానేస్తాం’ అని దొంగలతో  ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు మాల్యాద్రి, అభిషేక్ మహంతి, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement