ఉలిక్కిపడ్డారు..పరుగులు తీశారు | A police search of the town Carden | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడ్డారు..పరుగులు తీశారు

Published Wed, Dec 3 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

ఉలిక్కిపడ్డారు..పరుగులు తీశారు

ఉలిక్కిపడ్డారు..పరుగులు తీశారు

పట్టణంలో పోలీసుల కార్డెన్‌సెర్చ్
కేశవరావుతోటలో ఆకస్మిక తనిఖీలు
ఆందోళన చెందిన పలువురు కాలనీ వాసులు

 
కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : అది పట్టణంలోని ఆంధ్రా జాతీయ కళాశాల సమీపంలోనికేశవరావుతోట ప్రాంతం... సమయం మంగళవారం ఉదయం 5.30 గంటలు.. వాతావరణం నిర్మానుషంగా ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం ప్రశాంత వాతావరణంలో ఉంది.. ఆ ప్రాంతంలో ఉద్యోగులతో పాటు ఏ రోజుకారోజు కాయకష్టం చేసుకునే కూలీలు ఉన్నారు.. గతంలో ఆ కాలనీ పలు వివాదాలతో పోలీస్‌స్టేషన్ రికార్డుల్లోకి ఎక్కిన సంఘటనలు ఉన్నాయి.. చిన్న చిన్న నేరాలు, ఘోరాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి.. అలాంటి వాతావరణంలో ఉండే కాలనీలో  తెల్లవారుజామున 5.30 గంటలకు బూట్ల శబ్ధాలు కాలనీ వాసుల చెవినపడ్డాయి. ఖంగారుపడిన స్థానికులు చూడగా పోలీసు బృందాలు కుప్పలుతెప్పలుగా కాలనీలోకి పరుగులు పెడుతూ కనిపించాయి. దీంతో కాలనీ మొత్తం  ఉలిక్కిపడింది. కాలనీలోకి పరుగులు పెట్టిన పోలీసు బృందాలు గుంపులు గుంపులుగా విడిపోయి ఆ ప్రాంతంలోని ఇళ్లల్లో విస్త్రృత సోదాలు చేశారు. నిద్రలో ఉన్న వారిని సైతం తట్టిలేపారు. కంగారులో నిద్ర లేచిన వారికి కళ్లెదుట పోలీసులు కనబడటంతో ఉలిక్కిపడ్దారు. కాలనీలోకి పోలీసులు ఎందుకు వచ్చారు.. ఎవరి కోసం వెతుకుతున్నారు.. ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు.

అసలు విషయమేంటి అనే మీమాంసలో ఆ ప్రాంత వాసులందరూ ఖిన్నులై మిన్నుకుండిపోయారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మరికొందరు స్థానికులు  ఉరుకులు పరుగులు మీద రోడ్లపై వచ్చేశారు. కాలనీ మొత్తం పోలీసులు సోదాలు చేస్తుండటంతో అర్ధంకాని పలువురు అమాయకంగా పోలీసుల వైపు చూస్తుండటమే వంతుగా మిగిలింది. సోదాలు మొత్తం పూర్తి చేసుకున్న పోలీసులు అసలు విషయం చెప్పే వరకు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.  అధికారులు అసలు విషయం చెప్పే సరికి హమ్మయ్య అనుకున్నారు. ఇది మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని కేశవరావుతోటలో జరిగిన ఘటన. విషయానికొస్తే మంగళవారం ఉదయం బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు నేతృత్వంలో బందరు సబ్-డివిజన్ పరిధిలోని పోలీసులు కేశవరావుతోట ప్రాంతంలో నేర ప్రవృత్తి కలిగిన నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అందుకోసం డివిజన్ పరిధిలోని సుమారు 150 మంది పోలీసులు కాలనీపై ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు.

కాలనీలోని ఇంటింటిని సోదా చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు నాయకత్వం వహించగా డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిసి కార్డెన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. కేశవరావుతోట మొత్తం జల్లిడ పట్టిన పోలీసులు సుమారు 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారందరినీ ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అలాగే కాలనీలో పత్రాలు, నెంబరు ప్లేట్లు సరిగా లేని 10 వాహనాలను స్టేషన్‌కు తరలించారు. అయితే అదుపులోకి తీసుకున్న అనుమానితులు పలువురు తమ చిరునామాలను పోలీసులకు వివరించడంతో వారిని స్టేషన్ నుంచి పంపించివేశారు. మిగిలిన అనుమానితులను స్టేషన్‌లో విచారణ నిమిత్తం అట్టిపెట్టారు. అలాగే బైక్‌లకు సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నట్లు చూపించిన వారికి వారి బైక్‌లను అప్పగించేశారు. ఈ కార్డెన్‌సెర్చ్‌లో రూరల్ సీఐ వీఎస్‌ఎస్‌వీ మూర్తి, టౌన్ సీఐ సుబ్బారావు, ఎస్సైలు అశోక్,  నభీ, లోవరాజు, ఏ దుర్గారావు, అనిల్‌కుమార్, శ్రీహరికుమార్, 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement