చెక్‌పోస్టులపై ఏసీబీ కొరడా | Check posts on the acb Inspection | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టులపై ఏసీబీ కొరడా

Published Wed, Feb 11 2015 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

చెక్‌పోస్టులపై ఏసీబీ కొరడా

చెక్‌పోస్టులపై ఏసీబీ కొరడా

ఏక కాలంలో దాడులు
పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం..  మధ్యవర్తుల ద్వారా వసూళ్లు చేస్తున్న సిబ్బంది
పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు
 

నెట్‌వర్క్: రాష్ట్ర సరిహద్దుల్లోని పలు చెక్‌పోస్టులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెక్‌పోస్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో దాడులు చేసి.. పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ప్రతీ చెక్‌పోస్టులో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఈ దాడులు కొనసాగించారు. చెక్‌పోస్టుల సిబ్బంది వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు మధ్యవర్తులను కూడా నియమించుకున్నట్లు ఈ దాడుల్లో వెల్లడైంది. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ ఆర్టీఏ చెక్‌పోస్టు సిబ్బంది నుంచి రూ.31,760 పట్టుబడింది.

గతేడాది డిసెంబర్ 19న ఇదే చెక్ పోస్టుపై దాడి చేయగా రూ.5 లక్షల నగదు లభించిందని ఏసీబీ డీఎస్పీ రాందాస్ తేజా తెలిపారు. అలాగే, నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద ఉన్న చెక్‌పోస్టులపై చేసిన దాడుల్లో లెక్కతేలని రూ.44వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్‌పూర్‌లోని రవాణాశాఖ చెక్‌పోస్టు వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఏజెంట్ మగ్దూం నుంచి రూ. 25 వేలు, చెక్‌పోస్టులో ఉన్న రూ. 25,700ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రూ. 62,380, జహీరాబాద్ చెక్‌పోస్టు వద్ద రూ. 70 వేలు నగదు దొరికింది. ఈ దాడుల్లో వాణిజ్యపన్నులు, రవాణా శాఖలకు సంబంధించిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో తేలిన విషయాలను ఏసీబీ కమిషనర్‌కు నివేదిస్తామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement