మచిలీపట్నం టౌన్ : రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత పట్టణంలోని చేపల మార్కెట్ అంతా కలియతిరిగి పరిస్థితులను గమనించారు. చేపలను శుభ్రపరిచే స్థలంలో రేకుల షెడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం బేబీ సెంటర్‌ను సందర్శించి అక్కడి రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పసి పిల్లలతో ఉన్న బాలింతల గదిలో మూడు ఫ్యాన్‌లు తిరగనిస్థితిని ఆయన పరిశీలించారు. ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యాధికారిణి గీతామణిని వివరాలడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రి ఆవరణంలో 150 బెడ్‌ల చిన్నపిల్లల ప్రత్యేక వైద్యశాల నిర్మాణం జరుగుతోందని, బేబీ సెంటర్‌ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కలిపే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి చైర్మన్ మోటమర్రి వెంకటబాబాప్రసాద్‌తో కలసి పరిశీలించారు.
మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీవీ కుమార్‌బాబు, బందరు జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్ తదితరులున్నారు.
మంత్రి కొల్లు ఆకస్మిక తనిఖీలు
Published Sat, Jul 5 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
Advertisement
Advertisement