అక్షర దాతల గుర్తులు.. శిథిల సమాధులు! | National College Founder Tombs Place Is Anti Social Activities In Machilipatnam | Sakshi
Sakshi News home page

అక్షర దాతల గుర్తులు.. శిథిల సమాధులు!

Published Mon, Dec 9 2019 10:34 AM | Last Updated on Mon, Dec 9 2019 10:34 AM

National College Founder Tombs Place Is Anti Social Activities In Machilipatnam - Sakshi

మద్యం సీసాల మధ్య ఉన్న నేషనల్‌ కళాశాల వ్యవస్థాపకులు కోపెల్ల హనుమంతరావు, భారతి సమాధులు  

సాక్షి, మచిలీపట్నం: విద్యాదాతలను గౌరవించడం అందరి బాధ్యత. వారి స్మారకాలను భవిష్యత్‌ తరాల కోసం పదిలంగా ఉంచడం మన కర్తవ్యం. అయితే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్‌ కళాశాల వ్యవస్థాపకుల సమాధులకు పట్టిన గతి చూస్తే విద్యాదానం చేసిన వారిని ఏవిధంగా గౌరవిస్తున్నామో అర్థమవుతుంది. స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయమిది. 1906లో కోల్‌కత్తాలో నేషనల్‌ కాంగ్రెస్‌ జాతీయ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో ఉద్యమంలో ప్రజలను చైతన్యపర్చాలంటే దేశవ్యాప్తంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. నేషనల్‌ కళాశాలల పేరిట వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశాల్లో తీర్మానించడమే తరువాయి స్వాతంత్య్ర సమరయోధులు కోపెల్ల హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మచిలీపట్నంలో నేషనల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు.

కృష్ణారావు తన 20 ఎకరాలను కళాశాల కోసం దానం చేయగా, దాంట్లో హనుమంతరావు, పట్టాభి సీతారామయ్య కలిసి 1907లో నేషనల్‌ కళాశాల నిర్మాణానికి పూనుకున్నారు. మూడేళ్ల పాటు శ్రమించి దాతల నుంచి విరాళాలు సేకరించి 1909 మార్చి 25న కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించారు. 1910 మార్చి 27న ఆంధ్ర జాతీయ కళాశాలగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండే వెంకట్రామయ్య పంతులుతో ప్రారంభింపజేశారు. 1910 నుంచి 1922 వరకు ఈ కళాశాలకు వ్యవస్థాపక ప్రిన్సిపాల్‌గా కోపెల్ల హనుమంతరావు వ్యవహరించారు.

1922లో ఆయన మరణించారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్‌ కళాశాల ఇదే. ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు అనాడే విద్యను విస్తరించారు. నేషనల్‌ కళాశాల విద్యార్థి అంటే దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఒక గుర్తింపు, గౌరవం ఉండేది. అలాంటి కళాశాల నాటి వైభవాన్ని నేడు కోల్పోయిందనే చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా గుర్తింపు పొందాయి. ప్రైమరీ, హైసూ్కల్, ఇంటర్, డిగ్రీ, అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేసిన ఈ ప్రతిష్టాత్మక కళాశాల నేడు ఐదారువందల మందికి మించి విద్యార్థుల్లేని పరిస్థితి.

అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ విద్యాలయాల వ్యవస్థాపకులైన కోపెల్ల హనుమంతరావు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సమా«ధులు నేడు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. కళాశాల వెనుక భాగంలోనే హనుమంతరావుతో పాటు అతని కుటుంబ çసభ్యులందరి సమా«ధులున్నాయి. కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు బందరు వచ్చిన ప్రతిసారి ఈ సమా«ధులను దర్శించుకుని వెళ్తుంటారు. అలాంటి ఈ సమాధులు నేడు తుప్పల్లో శిథిలమై ఉన్నాయి. పైగా సమాధులు  మందుబాబులకు నిలయంగా మారాయి. సమా«ధుల చుట్టూ ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు చెత్తాచెదారం  చూడటానికే అత్యంత దయనీయంగా ఉంది అక్కడి పరిస్థితి. ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం ఈ సమా«ధుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని బందరు వాసులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement