ఆస్పత్రిలో అమాత్యుడి జపం!
అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఆఖరుకు ప్రభుత్వాస్పత్రుల్లోని డాక్టర్లను వదిలిపెట్టకుండా బందరు ఎమ్మెల్యే అయిన మంత్రితో చెప్పించమంటారా అంటూ వారిపై.. రోగుల సహాయకుల పేర్లతో వస్తున్న చోటామోటా నేతలు వత్తిడి పెడుతున్నారు. మేం మంత్రి గారి తాలూకా.. ప్రభుత్వం మాది మేం చెప్పినట్లు వైద్యం చేయండి అన్నచందాన వీరు తీరుంది. నాయకులింతే.. మారరంతే అని డాక్టర్లు.. కొందరు రోగులు అనుకుంటున్నారు.
మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే నడుం నొప్పితో ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. ఆయనకు సహాయకులుగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు.. ‘డాక్టర్ గారు.. నేను బందరు ఎమ్మెల్యేగారి తాలూకా. రోగి నాకు బాగా కావాల్సిన మనిషి. బాగా చూడండి. ఎమ్మారై స్కానింగ్ చేయించండి అన్నారు.’ దీంతో కంగుతిన్న వైద్యులు ‘ఎక్స్‌రే చాలు.. ఎమ్మారై అవసరం లేదని’ చెప్పినా వినకుండా.. మంత్రి గారితో చెప్పించ మంటారా? అని ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక ఎమ్మారై చేయించారు.’ ఇలాంటి పరిస్థితి ఉంది బందరు సర్వజన ఆస్పత్రిలో..
సాక్షి, మచిలీపట్నం: బందరు మొత్తం.. మంత్రి గారి తాలూకా అన్నవిధంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తార్కాణం బందరు సర్వజన ప్రభుత్వాస్పత్రి. ‘డాక్టర్‌గారూ.. నేను బందరు ఎమ్మెల్యే గారి తాలూకా.. ఆయన మంత్రిగారు కూడా.. చెప్పించమంటారా అంటూ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి డాక్టర్లపై ఒత్తిళ్లు పెంచుతున్నారు’ రోగుల సహాయకులుగా వచ్చే కొందరు నేతలు. అంతేకాకుండా వారు.. డాక్టర్లు చెప్పిన టెస్ట్‌లు కాకుండా ఎలాంటి పరీక్షలు రాయాలో కూడా ఆ నేతలే సూచిస్తున్నారు.
ఇది రోజు రోజుకూ పెరుగుతోందని డాక్టర్లు అంటున్నారు. మరి కొందరు సహాయకుల పేరుతో వచ్చే చోటామోటా నేతలు ఇంకాస్త ముందుకు వెళ్లి.. అవసరం లేకపోయినా అడ్మిట్ చేసుకోవాలని, వార్డులో బెడ్స్ వసతి కల్పించాలని తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రోగి పరిస్థితి, వ్యాధి లక్షణాల మేరకు అవసరమైన పరీక్షలు చేయిస్తామని, వైద్య సేవలు అందిస్తామని చెబుతున్నా వినడం లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment