
గ్యాస్-బ్యాంకుతో ఆధార్ అనుసంధానం
వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ ద్వారా గ్యాస్ సబ్సిడీ సదుపాయం అందుబాటులోకి రానుంది.
ప్రయోజనం
వెంకోజీపాలెం: వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ ద్వారా గ్యాస్ సబ్సిడీ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఈ సదుపాయం అమలు చేస్తున్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో కూడా కొద్ది నెలలు ఈ విధానం అమలు జరగడం తెలిసిందే. కాగా గతంలో గ్యాస్ ఏజెన్సీలోను, బ్యాంక్‌లోను ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోనివారు మాత్రమే ప్రస్తుతం ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీల పరిధిలో 8.25 లక్షలమంది వంటగ్యాస్ వినియోగదారులున్నారు.
వీరిలో 93మంది శాతం ఆధార్ వివరాలను గ్యాస్ డీలర్లు సేకరించారు. బ్యాంక్ ఖాతాలు మాత్రం 48శాతం మందివి మాత్రమే సేకరించగలిగారు. ఆధార్ కార్డు లేనివారు, బ్యాంక్ ఖాతాలు లేనివారికి వచ్చే మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి మాత్రం ఆధార్ అనుసంధానం లేనివారు పూర్తి ధర చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాల్సి వుంటుందని పౌరసరఫరాలశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
బ్యాంక్ ఖాతా కోసం...
ఇప్పటివరకు బ్యాంక్ ఖాతా లేని గ్యాస్ వినియోగదారులంతా సమీపంలోని బ్యాంక్‌లలో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద ఖాతాలు తెరవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డు జెరాక్స్, మూడు ఫోటోలు తీసుకెళితే సరిపోతుంది.
ఆధార్ కార్డు కోసం..
ఇప్పటివరకు ఆధార్ కార్డు రాకపోయినా, కొత్తగా వివరాలు నమోదు చేసుకోవాలన్నా, ప్రభుత్వ మీసేవ కేంద్రాలు లేదా ఎంవీపీ కాలనీ సెక్టార్-4లో గల కార్వీ, ద్వారకానగర్ తిలక్ షోరూమ్‌లైన్‌లో గల అలంకృత్ కేంద్రాలలో ఆధార్ కోసం వివరాలు నమోదు చేసుకోవచ్చు.
ఇవీ గ్యాస్ ధరలు
ప్రస్తుతం గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌కి రూ.438 వంతున చెల్లిస్తున్నారు. ఆధార్ అనుసంధానం చేసిన తరువాత గ్యాస్ బాయ్‌కి రూ.832.50 వంతున చెల్లించాల్సి వుంటుంది. ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు బ్యాంక్ ఖాతాలలో రూ.368.70 సబ్సిడీ కింద జమ చేస్తుంది. అంటే గ్యాస్‌ధర రూ.464 అవుతుంది.
ఆధార్, బ్యాంక్ ఖాతా అనుసంధానం ఇలా...
ముందుగా గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, గ్యాస్ పాస్‌బుక్ జెరాక్స్ కాపీలు అందజేయాల్సి వుంటుంది. తరువాత బ్యాంక్‌లో ఆధార్ కార్డు జెరాక్స్ అందజేయాల్సి వుంటుంది. ఎస్‌బీహెచ్ బ్రాంచీలలో ఖాతాదారులు నిర్ణీత ఫారంలో వివరాలు నమోదు చేయాల్సి వుంటుంది. ఎస్‌బీఐలో మాత్రం ఆధార్ కార్డు జెరాక్స్ కాపీపై బ్యాంక్‌ఖాతా నెంబర్ రాసి ఇస్తే సరిపోతుంది.