
‘పొట్టి రాంబాబు’ హీరోగా ‘పులిరాజా ఐపీఎస్’
జగ్గంపేట : సాధారణంగా పోలీసయ్యేందుకు పొడవు ఒక ప్రధాన కొలమానమని, అయితే మూడు నాలుగడుగుల పొడవే ఉన్నా పోలీస్ అవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకుని వ్యక్తి కథతో తీస్తున్న చిత్రమే ‘పులిరాజా ఐపీఎస్’ అని హాస్యనటుడు పొట్టి రాంబాబు, ఆ చిత్రం డెరైక్టర్ రాఘవ తిరువానిపాటి తెలిపారు. ఆదివారం జగ్గంపేట వచ్చిన వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పొట్టి రాంబాబు హీరోగా నటిస్తున్న ‘పులిరాజా ఐపీఎస్’ గురించి వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ నెల 29 నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ జరుపుతామని డెరైక్టర్ రాఘవ తెలిపారు. హీరో పొట్టి రాంబాబుకు తండ్రిగా ఎంఎస్ నారాయణ నటిస్తున్నారని, ఆయన ఈ చిత్రంలో కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నారని చెప్పారు. ఆయన కుమారుడైన రాంబాబును పోలీసు చేయాలని కలలు కంటారని, అయితే తక్కువ పొడవున్న రాంబాబు ఏ విధంగా ఐపీఎస్ అవుతాడనేదే కథలో ప్రధానమని వివరించారు. హీరోగా తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, చిత్రం విజయానికి శ్రమించి పనిచేస్తున్నానని రాంబాబు తెలిపారు. వీరితో పాటు హాస్యనటుడు బబ్లూ ఉన్నారు.