శ్రీహరి మృతితో ‘అక్షర’ గ్రామాల్లో విషాదం | Sakshi
Sakshi News home page

శ్రీహరి మృతితో ‘అక్షర’ గ్రామాల్లో విషాదం

Published Thu, Oct 10 2013 3:13 AM

Actor Srihari Nomore.. Tragedy in Akshara Villages

శామీర్‌పేట్‌, న్యూస్‌లైన్‌: పేదల జీవితాల్లో వెలుగు నింపి.. చిరునవ్వులు కురిపించిన ‘అక్షర’ ఫౌండేషన్‌ అధినేత, సినీనటుడు శ్రీహరి ఇక లేరన్న వార్త మండలంలోని లక్ష్మాపూర్‌, అనంతారం గ్రామాల్లో విషాదాన్ని నింపింది. సినీనటుడుగా, మంచి వక్తగా, రియల్‌ హీరోగా ఆయనకు మంచి పేరుంది. తన కూతురు అక్షర పేరిట అక్షర ఫౌండేషన్‌ ద్వారా పేద ప్రజలకు తనవంతుగా సహాయాన్ని అందించి నిజ జీవితంలోనూ రియల్‌ హీరో అనిపించుకున్నారు. గుక్కెడు నీరు దొరక్క ఉక్కిరిబిక్కిరి అవుతున్న నిరుపేదలకు అక్షర ఫౌండేషన్‌ ద్వారా దాహార్తిని తీర్చి వారిలో చిరునవ్వుల వెలుగులు చిందించారు. గత నాలుగేళ్ల క్రితం ఆయన మండలంలోని అనంతారం, లక్ష్మాపూర్‌ గ్రామాలను దత్తత తీసుకున్నారు. చిన్నారులకు, పేదవారికి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలుసేవా కార్యక్రమాలు అందిస్తున్నారు.

ఫ్లోరైడ్‌ బాధితులకు ఆసరాగా..
మండలంలోని అనంతారం, లక్ష్మాపూర్‌, లక్ష్మాపూర్‌ తండాల్లో ఫ్లోరైడ్‌తో ఎంతోమంది బాధపడుతుండేవారు. ఈ విషయం శ్రీహరి దృష్టికి వచ్చింది. దీంతో తన కూతురు అక్షర పేరుతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థతో ఫ్లోరైడ్‌ బాధితులకు ఆసరాగా నిలవాలనిసంకల్పంచారు. అనుకున్నదే తడవుగా మండలంలోని లక్ష్మాపూర్‌, అనంతారం, లక్ష్మాపూర్‌ తండాతోపాటు నారాయణపూర్‌ గ్రామాలను సందర్శించి ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమేందుకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. లక్ష్మాపూర్‌, అనంతారం గ్రామాలను శ్రీహరి దత్తత తీసుకున్నారు.

2009 జూన్‌ 15న లక్ష్మాపూర్‌ గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్లాంట్‌లో పేదలకు కేవలం రూ.2కే 20 నుంచి 40 లీటర్ల శుద్ధి చేసిన నీరు అందిస్తున్నారు. శుద్ధి చేసిన నీరు తీసుకెళ్లేందుకు 40లీటర్ల వాటర్‌ డబ్బాలను, పేద విద్యార్థులకు యూనిఫాంలు, మధ్యాహ్న భోజనాలకు ప్లేట్లు, అందజేశారు. తన జీవిత కాలమంతా లక్ష్మాపూర్‌, అనంతారం గ్రామాలలో తాగునీరుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి లక్ష్మాపూర్‌, అనంతారం గ్రామంలో తాగునీటికి కొరత లేదు. ఈ రెండుగ్రామాలను దత్తత తీసుకుని నాలుగేళ్లుగా చేయూతనిస్తూ వస్తున్న అక్షర ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీహరికి ఇక లేరన్న వార్త మండలంలో విషాదాన్ని నింపింది.

ఘన నివాళి పేదల జీవితాల్లో చిరునవ్వులు నింపిన సినీనటుడు శ్రీహరి మృతి తీరని లోటని లక్ష్మాపూర్‌, అనంతారం గ్రామస్తులు పేర్కొన్నారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కాలేయ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన శ్రీహరికి లక్ష్మాపూర్‌, అనంతారం గ్రామస్తులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీహరి మృతికి సంతాపంగా గురువారం గ్రామంలో బైక్‌ర్యాలీతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని లక్ష్మాపూర్‌ గ్రామస్తులు తెలిపారు. శ్రీనివాస్‌ గుప్తా, క్యాతం రవి, శంకర్‌, స్వామి, రవి, భాస్కర్‌, వీరేష్‌, నర్సయ్య, బండి జగన్నాథం, అనంతారం మాజీ సర్పంచ్‌ గౌస్‌పాషా, లక్ష్మాపూర్‌ మాజీ సర్పంచ్‌ పావని, మజీద్‌ పూర్‌ గ్రామస్తుడు తుంకిమల్లేష్‌ తదితరులు శ్రీహరి మృతిపైసంతాపం వ్యక్తంచేశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement