సాక్షి, శ్రీకాళహస్తి : ఐఐటీ తిరుపతి అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు వినతి పత్రం అందజేశామన్నారు. తిరుపతి ఐఐటీ మొదటి స్నాతకోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన సమయంలో ఏర్పడిన విద్యాసంస్థల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు.
‘రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ సంస్థకు 548 ఎకరాలను కేటాయించిందని, ఇందులో ఇంకా 18 ఎకరాల భూమిని అందజేయాల్సి ఉంది. త్వరలో భూమిని స్వాధీనం చేస్తాం. నీటి సరఫరా పెద్ద సమస్యగా ఉందని, దీని కోసం 44 కోట్లతో ప్రణాళిక రూపొందించి కేంద్ర మంత్రికి వన్నవించాం. గ్రాంట్లు అందిన వెంటనే నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఐఐటీ అభివృద్ధి కోసం సీఎం సూచన మేరకు కేంద్ర మంత్రి సహకారాన్ని కోరుతూ వినతిపత్రం అందజేశాం. రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పథకం అమలులో సమస్యలు ఉన్న మాట వాస్తవం. వెంటనే వాటిని పరిష్కరిస్తాం’అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment