IIT Tirupati
-
తిరుపతి ఐఐటీతో గృహనిర్మాణశాఖ ఒప్పందం..
సాక్షి, అమరావతి: పేదలకు నిర్మించే ఇళ్లు మరింత పటిష్టంగా ఉండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నాణ్యత ప్రమాణాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇంజినీర్లకు శిక్షణ ప్రారంభించింది. పేదలకు నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలని గృహనిర్మాణశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో భాగంగా మొదటి విడత 15 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు. ఇళ్ల నిర్మాణాలు దేశానికే ఆదర్శంగా ఉండేలా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. దీంతో తమశాఖ ఇంజినీర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు గృహనిర్మాణశాఖ తిరుపతి ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ స్థాయిలకు చెందిన 1,100 మంది ఇంజినీర్లకు బృందాలుగా నాలుగురోజులు ఆన్లైన్లో ఇచ్చే శిక్షణ కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో గృహనిర్మాణశాఖ కార్యాలయాల్లో హాజరైన ఇంజినీర్లకు తిరుపతి ఐఐటీ నుంచి ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ సివిల్, పర్యావరణ విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్లతో శిక్షణ ఇస్తామని చెప్పారు. గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, గృహనిర్మాణసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్‌కుమార్ మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. ►పేదలందరికీ ఇళ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ►ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఈ శిక్షణ నిరంతరం కొనసాగుతుంది. ►నిర్మాణంలో ఇనుము, సిమెంట్, ఇతర ముడిపదార్థాలు నాణ్యమైనవి సరఫరా చేస్తాం. ►కాలుష్య రహితంగా, పూర్తి భద్రత ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా ఇంజినీర్లు చొరవ చూపాలి. ►ఇంజనీర్ల బృందాలను తిరుపతి ఐఐటీ ప్రాంగణానికి పంపిస్తాం. అక్కడి ల్యాబ్‌లు తదితరాలు పరిశీలించి మరింత అవగాహన పెంచుకోవచ్చు. ►గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు కూడా శిక్షణ ఇస్తాం. ►గృహనిర్మాణసంస్థ చీఫ్ ఇంజనీర్ సీహెచ్ మల్లికార్జునరావు కూడా పాల్గొన్నారు. -
‘ఐఐటీ తిరుపతి అభివృద్దికి సహకరించండి’
సాక్షి, శ్రీకాళహస్తి : ఐఐటీ తిరుపతి అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు వినతి పత్రం అందజేశామన్నారు. తిరుపతి ఐఐటీ మొదటి స్నాతకోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన సమయంలో ఏర్పడిన విద్యాసంస్థల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ సంస్థకు 548 ఎకరాలను కేటాయించిందని, ఇందులో ఇంకా 18 ఎకరాల భూమిని అందజేయాల్సి ఉంది. త్వరలో భూమిని స్వాధీనం చేస్తాం. నీటి సరఫరా పెద్ద సమస్యగా ఉందని, దీని కోసం 44 కోట్లతో ప్రణాళిక రూపొందించి కేంద్ర మంత్రికి వన్నవించాం. గ్రాంట్లు అందిన వెంటనే నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఐఐటీ అభివృద్ధి కోసం సీఎం సూచన మేరకు కేంద్ర మంత్రి సహకారాన్ని కోరుతూ వినతిపత్రం అందజేశాం. రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పథకం అమలులో సమస్యలు ఉన్న మాట వాస్తవం. వెంటనే వాటిని పరిష్కరిస్తాం’అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
తిరుపతి ఐఐటీ ప్రారంభం
నేటి నుంచి తరగతులు: ఏపీ మంత్రి గంటా తిరుపతి మంగళం: తిరుపతిలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని రాష్ట్ర మానవ వనరుల ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. సంస్థ 2015-16 విద్యా సంవత్సరం బుధవారంతో ప్రారంభమైందని, గురువారం నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయని గంటా తెలిపారు. 120 మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతారన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఏపీ సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే తిరుపతిలో ఐఐటీ ప్రారంభించారని చెప్పారు. తిరుపతి ఐఐటీని దేశంలోనే ఉన్నతమైన విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రేణిగుంట రోడ్డులోని కృష్ణతేజ విద్యాసంస్థల ప్రాంగణంలో ఐఐటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, కళాశాలల్లో ర్యాగింగ్‌ను నిరోధించడానికి ప్రస్తుతమున్న చట్టాలను బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేసి నిజమైన లబ్ధిదారులకే ఆ పథకం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.