తిరుపతి ఐఐటీ ప్రారంభం
నేటి నుంచి తరగతులు: ఏపీ మంత్రి గంటా
తిరుపతి మంగళం: తిరుపతిలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని రాష్ట్ర మానవ వనరుల ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. సంస్థ 2015-16 విద్యా సంవత్సరం బుధవారంతో ప్రారంభమైందని, గురువారం నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయని గంటా తెలిపారు. 120 మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతారన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఏపీ సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే తిరుపతిలో ఐఐటీ ప్రారంభించారని చెప్పారు.
తిరుపతి ఐఐటీని దేశంలోనే ఉన్నతమైన విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రేణిగుంట రోడ్డులోని కృష్ణతేజ విద్యాసంస్థల ప్రాంగణంలో ఐఐటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, కళాశాలల్లో ర్యాగింగ్‌ను నిరోధించడానికి ప్రస్తుతమున్న చట్టాలను బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేసి నిజమైన లబ్ధిదారులకే ఆ పథకం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.