తెల్లబంగారం మందగమనం | Adoni yard reduced cotton yields | Sakshi
Sakshi News home page

తెల్లబంగారం మందగమనం

Published Mon, Jan 6 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Adoni yard reduced cotton yields

ఆదోని, న్యూస్‌లైన్: ఆదోని మార్కెట్ యార్డుకు విక్రయానికి తరలివచ్చే పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో స్థానిక జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీల యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణంలో ఉన్న సుమారు 90 వరకు ఫ్యాక్టరీలకు రోజుకు 18వేల క్వింటాళ్ల పత్తి అవసరమవుతుండగా ప్రస్తుతం మార్కెట్‌కు 8 నుంచి 12వేల క్వింటాళ్లకు మించి పత్తి రావడం లేదు. దీంతో పత్తి కొరత ఏర్పడి ఫ్యాక్టరీల నిర్వహణ కష్టమవుతోందని నిర్వాహకులు వాపోతున్నారు.

గత ఏడాది వరకు పట్టణంలో 65 జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆదోని పరిసర ప్రాంతాల్లో పత్తి సాగు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ మేరకు యార్డుకు వచ్చే దిగుబడులు కూడా పెరిగాయి. దీంతో స్థానిక పారిశ్రామిక వేత్తల దృష్టి ఇటువైపు మళ్లడంతో పట్టణంలో ఫ్యాక్టరీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 20వరకు జిన్నింగ్ ఫ్యాక్టరీలు, 6 ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. మరో 12వరకు జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే  నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే వ్యసాయ సీజన్ ప్రారంభంలోగా వీటిని ప్రారంభించే అవకాశం ఉంది.

 కొద్దిరోజులుగా సమస్య..:
  గత నెల రెండోవారం వరకు కూడా సగటున మార్కెట్ యార్డుకు 20వేల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడులు అమ్మకానికి వచ్చాయి. దీంతో ఫ్యాక్టరీలకు ముడి సరుకు కొరత ఏర్పడలేదు. పట్టణంలోని అన్ని ఫ్యాక్టరీలు మూడు షిఫ్టుల్లో నడిచాయి. దాదాపు 10వేల మంది కార్మికుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే  మెట్టభూములతోపాటు కొన్ని ప్రాంతాల్లో బోర్లు, కాల్వల కింద సాగు చేసిన పంట నుంచి దిగుబడులు పూర్తిగా చేతికందడం, రైతుల్లో చాలా మంది వాటిని ఇప్పటికే అమ్ముకోవడంతో యార్డుకు పత్తిరాక మందగించింది. దీంతో స్థానిక ఫ్యాక్టరీలకు ముడిసరుకు కొరత ఏర్పడింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement