Jinning Factory
-
దురాచారాలు కొనసాగడం దారుణం
తాండూరు, న్యూస్‌లైన్: హైటెక్ యుగంలో జోగిని వంటి దురాచారాలు కొనసాగడం దారుణం అని ఎస్పీ రాజకుమారి అన్నారు. పెద్దేముల్లో ‘బాలికను జోగిని’గా మార్చినట్లు భావిస్తున్న ఘటనపై సమగ్రంగా విచారణ జరుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఎస్పీ సోమవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న నేడు ఇంకా గ్రామాల్లో జోగిని, బాణామతి, తదితర సాంఘిక దురాచారాలు కొనసాగడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఆదివారం పెద్దేముల్లో 12 ఏళ్ల బాలికను 60 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబీకుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. స్థానిక పోలీసులకు ఈ విషయమై సమాచారం అందగానే సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారన్నారు. స్థానిక వీఆర్వో ద్వారా ‘జోగిని’ఘటనపై వివరాలు సేకరించి విచారణ జరుపుతామన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో త్వరలో గ్రామాల్లో దురాచారాల నివారణకు కళాబృందాల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారు. తాండూరు పట్టణంలో ఆదివారం దంత వైద్యం కోసం వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు శెట్టి బస్వరాజ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వైద్యుడిపై అదనంగా నిర్భయ చట్టంతో పాటు 323 సెక్షన్‌ను జతచేస్తామని ఎస్పీ చెప్పారు. వారం, పది రోజుల్లో జిల్లాలో ఎస్ఐల బదిలీలు ఉంటాయన్నారు. బాలికలకు సంబంధించిన ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకే విలేకరులు వార్తలు రాయాలని, ఊహజనిత కథనాలు రాస్తే సంబంధీకులపై కేసు నమోదు చేసేందుకు చట్టాలు ఉన్నాయని ఎస్పీ రాజకుమారి తెలిపారు. పాస్టర్ హంతకులను గుర్తించాం.. వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు హత్య కేసులో నిందితులతోపాటు ఘటనకు సంబంధించిన సూత్రదారులను గుర్తించామని ఎస్పీ రాజకుమారి చెప్పారు. త్వరలోనే నిందితుల్ని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తామన్నారు. యాలాలలోని జిన్నింగ్ ఫ్యాక్టరీలో రైతులకు నకిలీ నోట్ల పంపిణీ వ్యవహారంపై విచారణ జరపాలని తాండూ రు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్‌ను ఎస్పీ ఆదేశించారు. ఫ్యాక్టరీ సంబంధీకుల ఇళ్లలో సోదాలు జరపాలని చెప్పారు. -
తెల్లబంగారం మందగమనం
ఆదోని, న్యూస్‌లైన్: ఆదోని మార్కెట్ యార్డుకు విక్రయానికి తరలివచ్చే పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో స్థానిక జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీల యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణంలో ఉన్న సుమారు 90 వరకు ఫ్యాక్టరీలకు రోజుకు 18వేల క్వింటాళ్ల పత్తి అవసరమవుతుండగా ప్రస్తుతం మార్కెట్‌కు 8 నుంచి 12వేల క్వింటాళ్లకు మించి పత్తి రావడం లేదు. దీంతో పత్తి కొరత ఏర్పడి ఫ్యాక్టరీల నిర్వహణ కష్టమవుతోందని నిర్వాహకులు వాపోతున్నారు. గత ఏడాది వరకు పట్టణంలో 65 జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆదోని పరిసర ప్రాంతాల్లో పత్తి సాగు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ మేరకు యార్డుకు వచ్చే దిగుబడులు కూడా పెరిగాయి. దీంతో స్థానిక పారిశ్రామిక వేత్తల దృష్టి ఇటువైపు మళ్లడంతో పట్టణంలో ఫ్యాక్టరీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 20వరకు జిన్నింగ్ ఫ్యాక్టరీలు, 6 ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. మరో 12వరకు జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే వ్యసాయ సీజన్ ప్రారంభంలోగా వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా సమస్య..: గత నెల రెండోవారం వరకు కూడా సగటున మార్కెట్ యార్డుకు 20వేల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడులు అమ్మకానికి వచ్చాయి. దీంతో ఫ్యాక్టరీలకు ముడి సరుకు కొరత ఏర్పడలేదు. పట్టణంలోని అన్ని ఫ్యాక్టరీలు మూడు షిఫ్టుల్లో నడిచాయి. దాదాపు 10వేల మంది కార్మికుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే మెట్టభూములతోపాటు కొన్ని ప్రాంతాల్లో బోర్లు, కాల్వల కింద సాగు చేసిన పంట నుంచి దిగుబడులు పూర్తిగా చేతికందడం, రైతుల్లో చాలా మంది వాటిని ఇప్పటికే అమ్ముకోవడంతో యార్డుకు పత్తిరాక మందగించింది. దీంతో స్థానిక ఫ్యాక్టరీలకు ముడిసరుకు కొరత ఏర్పడింది.