ప్రచార పటాటోపం ! | Advertising patatopam! | Sakshi
Sakshi News home page

ప్రచార పటాటోపం !

Published Mon, Jan 5 2015 1:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

ప్రచార పటాటోపం ! - Sakshi

ప్రచార పటాటోపం !

పట్టణ ప్రాంత ప్రజలారా.. మీ సమస్యలేమిటో చెప్పండి.. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.. అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రచారం ఆర్భాటంగానే మిగిలింది. మున్సిపాలిటీల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి  రూపొందించిన ఆన్‌లైన్ విధానంపై ప్రజలకు అవగాహన కొరవడింది. దాంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు.

కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులొస్తే పరిష్కరించడం తలకు మించిన భారమవుతుందని భావించారో ఏమో.. మున్సిపల్ అధికారులు దీనికి తగిన ప్రచారం కల్పించలేదు. దీంతో ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టి నాలుగు నెలలైనా ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించటం లేదు.

 
చిలకలూరిపేట : మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, పైపులైన్ల లీకులు, మురుగునీటి పారుదల, రోడ్ల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలకశాఖ గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ఆర్‌వోసీ నం 12220/2014-డి పేరుతో సర్క్యులర్ జారీ చేసింది.

సీడీఎంఏ వెబ్‌సైట్‌లో సిటిజన్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ అనే నూతన విభాగాన్ని ఏర్పాటు చేసింది. నవ్యాంధ్రప్రదేశ్‌లోని 111 మున్సిపాలిటీల్లో ఈ పద్ధతి అదే నెల 12వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా సమస్య,  తీవ్రతను వివరిస్తూ ఒక ఫొటో జోడించి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకునేలా ఈ విధానాన్ని రూపొందించారు.

స్పందన ఏదీ..?
జిల్లాలో  సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి 2 తేదీ వరకు సిటిజన్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్‌కు గుంటూరు కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల నుంచి 144 ఫిర్యాదులు మాత్రమే అందాయి. ఇందులో 121 పరిష్కారం అయ్యాయి. మిగిలిన 13 ఈ ఆన్‌లైన్ ఫిర్యాదులకు సంబంధం లేనివి. కార్పొరేషన్ పరిధి మినహాయిస్తే మిగిలిన మున్సిపాలిటీల్లో చిలకలూరిపేటలో అత్యధికంగా 18 ఫిర్యాదులు అందాయి.

ఒక్క ఫిర్యాదు కూడా అందని మున్సిపాలిటీగా రేపల్లె నిలిచింది. ఈ గణాంకాలను చూస్తే ప్రజల నుంచి స్పందన కరువైందనేది స్పష్టమవుతోంది. మున్సిపాలిటీల్లో సమస్యలు లేకకాదు.. ఫిర్యాదు చేయడంపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

ఫిర్యాదు చేసేదిలా...
ముందుగా సీడీఎంఏ.ఏపీ.జీవోవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన అనంతరం ఎడమ వైపున ఉండే సిటిజన్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్‌పై క్లిక్ చేయాలి.

కొత్త విండో తెరచుకొని సిటిజన్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్‌లో చెత్తబుట్ట, కాల్వల్లో మురుగు, పైపులైన్ లీకేజీ, రోడ్డుపై గుంత ఫొటోలు కనిపిస్తాయి.

ఫిర్యాదు చేసే అంశంపై ఏ పరిధిలోకి వస్తుందో దానిపై క్లిక్ చేయాలి.

ఉదాహరణకు పైపులైన్ లీక్‌పై ఫిర్యాదు చేయదలిస్తే వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా పైపులైన్ లీకేజీ బొమ్మపై క్లిక్ చేయాలి.

ఫిర్యాదు నమోదు చేయటానికి ఆరు అంశాలతో దరఖాస్తు ప్రత్యక్షమవుతుంది.
ముందుగా ఫిర్యాదుదారుడు ఏ మున్సిపాలిటీకి చెందినదీ తెలపాలి.
యూఎల్‌బీ నేమ్ అన్న సూచిక ఎదురుగా క్లిక్‌చేస్తే సమస్య ఏ మున్సిపాలిటీదో ఆ పేరు పేర్కొనాలి.
అనంతరం ఫిర్యాదుదారుని పేరు, సెల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ(ఉంటే), సమస్య ఏప్రాంతానికి చెందినదో తెలపాలి.
తరువాత సమస్య తీవ్రత తెలిపే ఫొటో జత చేయాలి.
వీటిని పూర్తి చేసిన తరువాత సబ్‌మిట్ అన్న చోట క్లిక్ చేస్తే సెల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదు నంబర్ వస్తుంది.
ఇక్కడితో ఫిర్యాదుదారుడి పనిపూర్తవుతుంది.
సమస్య పరిష్కరించి ఫొటో జత చేయగానే ఫిర్యాదు దారుని సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్, మెయిల్‌కు సమాచారం వస్తుంది.
సమస్య పరిష్కారమైన తీరును సెర్చ్ గ్రీవెన్స్ స్టేటస్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement