అంతా కొత్త.. కోత! | After loss, Andhra Pradesh sees new opportunity | Sakshi
Sakshi News home page

అంతా కొత్త.. కోత!

Published Mon, Jun 2 2014 1:01 AM | Last Updated on Wed, Oct 17 2018 5:04 PM

అంతా కొత్త.. కోత! - Sakshi

అంతా కొత్త.. కోత!

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడంతో దాని ప్రభావం ఎంతో కొంత శ్రీకాకుళం జిల్లాపైనా పడనుంది. ఆర్థిక లోటుతో మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లపాటు ప్రభుత్వంతోపాటు ప్రజలు కష్టాలు ఎదుర్కోక తప్పదు. తలసరి ఆదాయం తగ్గడంతో పాటు వ్యయం పెరగడం వలన పన్నులు, ధరలు పెరిగిపోయే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్, రవాణా, ఉద్యోగ, వ్యాపార రంగాలతోపాటు పెన్షనర్లపై విభజన ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వలసలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్నప్పటికీ.. అది పరాయి రాష్ట్రంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. కొత్త రాష్ట్రంలో ఏఏ రంగాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో ఒకసారి పరిశీలిస్తే..
 
 ఉద్యోగులకు జీతాలు కష్టం
 భారీ ఆర్థికలోటుతో కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వల్ల జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులకు ఒకటి రెండు నెలలుజీతాలు అందే పరిస్థితి ఉండదు. అలాగే నాన్‌లోకల్ కేటగిరీలో తెలంగాణ  జిల్లాల్లో పనిచేస్తున్న వారిని తిరిగి జిల్లాకు పంపిస్తే కొన్నేళ్ల పాటు ఉద్యోగ నియామకాలు నిలిచిపోయి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. నాన్‌లోకల్ కేటగిరీలో పనిచేసే వారు ఇంతవరకు పరస్పర బదిలీల కింద సొంత జిల్లాలకు వచ్చేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉండవు. శాశ్వతంగా ఆ రాష్ట్రంలోనే పదవీ విరమణ వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ సొంత రాష్ట్రానికి పంపిస్తే గత సీనియార్టీ పోయి పదోన్నతులు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వాటి వల్ల న్యాయపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి.
 
 త్రిశంకు స్వర్గంలో కాంట్రాక్టు ఉద్యోగులు
 పలు శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగులకు భవిష్యత్ ప్రశ్నార్ధకంగా కానుంది. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వ దయాదాక్షణ్యాలపై వీరి భవితవ్యం ఆధారపడి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు సీనియార్టీ బట్టి రెగ్యులర్ చేస్తామని తెలుగుదేశం నేతలు హామీ ఇచ్చినా అది అమలయ్యే పరిస్థితి కన్పించడం లేదు. కనీసం రెగ్యులర్ కాకపోయినా తమను కాంట్రాక్టు పద్ధతిలోనైనా కొనసాగించాలని వేడుకునే పరిస్థితి నెలకొంది.
 
 వ్యాపారాలకు పర్మిట్ల భారం
 వ్యాపారాలపై పన్నులు, పర్మిట్ల భారం పడుతుంది. ఇది వరలో హైదరాబాద్ మొదలుకొని తెలంగాణ లోని 10 జిల్లాల నుంచి ఏ వస్తువులను దిగుమతి చేసుకున్నా.. అలాగే ఇక్కడి నుంచి ఎగుమతి చేసినా పర్మిట్ల తలనొప్పి, పన్ను భారం ఉండేది కాదు. ఇప్పుడు అది వేరే రాష్ట్రం కావడం వల్ల ఎగుమతి, దిగుమతులకు ప్రత్యేక పర్మిట్లు పొందడంతో పాటు అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వ్యాపారులకు ఇబ్బంది కాకపోయినా ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా వ్యాపారాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రజలు ఎక్కువ ధరలను వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
 
 రవాణా
 ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవాణా, ఇతర వాహనాలు తెలంగాణ కు వెళ్లాలంటే ప్రత్యేక పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా అద్దె పెంచాల్సి వస్తుంది. వాహనాల నెంబర్లు కూడా మారుతాయి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు ఎపీ-30తో రిజిస్ట్రేషన్ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇదే నెంబరు కొనసాగినా కొద్ది రోజుల తరువాత రిజిస్ట్రేషన్ నెంబరు మారుతుంది. వాహనాల పన్ను, రిజిస్ట్రేషన్ల రుసుం పెరిగే అవకాశాలుంటాయని రవాణా రంగ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
 పెరగన్ను విద్యుత్ కోతలు
 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రానికి విద్యుత్ కేటాయింపులు తగ్గడంతో ఆ ప్రభావం జిల్లాపైన కూడా పడుతుంది. కోతల మరింత పెరుగుతాయి. కొత్త రాజధాని ఆవిర్భావంతో పాటు ఇతర జిల్లాల్లో పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పిన తరువాత శ్రీకాకుళం జిల్లాకు కేటాయింపులు మరింత తగ్గే ప్రమాదం ఉంటుంది. అప్పుడు జిల్లాప్రజలతో పాటు రైతాంగానికి తీవ్ర కష్టాలు ఎదురుకానుంది.

  రైతులకు కష్టకాలం
 జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారే. రాష్ట్ర విభజన ప్రభావం వీరిపై ఎక్కువగా పడనుంది. విద్యుత్ కోతల వల్ల సాగునీరు సకాలంలో అందే పరిస్థితి ఉండదు. ఎరువులు, విత్తనాల కేటాయింపులు, రాయితీల్లో కూడా మార్పులు జరగనున్నాయి. నిధుల కొరతతో వంశధార, తోటపల్లి, మడ్డువలస, ఆప్‌షోర్ వంటి ప్రాజెక్టుల పనులు మరింతగా మందగించనున్నాయి. ఇప్పటికే ఉన్న రుణాలు తీర్చలేక పోవడంతో రైతులకు కొత్త రుణాలు వచ్చే పరిస్థితి ఉండదు.  
 
 సంక్షేమానికి చేటు
 భారీ ఆర్థిక లోట ప్రభావం సంక్షేమ పథకాలపై పడుతుంది. పథకాల అమలు కుంటుపడే ప్రమాదముంది. రేషన్‌కార్డులు మార్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో రేషన్ కోటాలో కోతలు పడే వీలుంటుంది. ఇప్పటికే మూడు నెలలకు పైగా పింఛన్లు లేక ఆకలితో అలమటిస్తున్న వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్‌దారులు మరింత కష్టాల బారిన పడే పరిస్థితి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement