మెదక్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే మంబోజిపల్లిలోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ భవితవ్యంపై నిర్ణయం తీసుకుందామని, అప్పటివరకు యథాతథ పరిస్థితిని కొనసాగించాలని చెరకు రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ‘నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయాలా?, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలా?’ అనే విషయమై మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు రైతుల అభిప్రాయ సేకరణకు సోమవారం మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్స్‌లో ఆర్డీఓ వనజాదేవి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఫ్యాక్టరీ పరిధిలోని 12 మండలాలకు చెందిన 3,500 మంది చెరకు రైతులకు కేవలం 200 మంది రైతులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజార్టీ రైతులు ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఒక్కరు మాత్రం ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయాలని కోరారు.
ప్రస్తుతం చెరకు నరికే పనిలో ఉన్నందున అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రైతులు రాలేదని తెలిసింది. ఈ సమయంలో అభిప్రాయాలు చెబితే పర్మిట్ల జారీలో ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం ఉందని పలువురు రైతులు డుమ్మా కొట్టినట్టు సమాచారం. కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడనున్నందున అప్పటి వరకు ఫ్యాక్టరీ యాజమాన్యంపై యథాతథ స్థితిని కొనసాగించాలని రైతులంతా ముక్తకంఠంతో తీర్మానానికి మద్దతు పలికారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, డెరైక్టర్లు ఆంజనేయులు, రామకిష్టయ్య, మెదక్ ఏఎంసీ మాజీ చైర్మన్ మధుసూదన్‌రావులు రైతుల తరఫున తీర్మాన పత్రాన్ని ఆర్డీఓ వనజాదేవి, కేన్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట్వ్రికి అందజేశారు.
ఎన్డీఎస్‌ఎల్‌పై ‘టీ’ తరువాతే నిర్ణయం
Published Mon, Dec 23 2013 11:56 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement