తెలంగాణ సిద్ధాంత కర్తగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాడని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు.
మెదక్: తెలంగాణ సిద్ధాంత కర్తగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాడని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలో జరిగిన జయశంకర్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు వెనకడుగు వేయవద్దని జయశంకర్ సార్, కేసీఆర్‌ను వెన్నుతట్టి ప్రోత్సహించారన్నారు.
తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎన్నోసార్లు ఆటుపోట్లు ఎదురయ్యాయనీ, అయినప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దంటూ జయశంకర్ కేసీఆర్‌కు ధైర్యం నూరిపోశారన్నారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా బతికిన జయశంకర్ తెలంగాణ ఫలాలను అనుభవించకుండానే వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. జయశంకర్ నాలున్నరకోట్ల తెలంగాణ ప్రజలను నడిపిస్తే... తాను ఆయనకు నీడలా వెంటే ఉండేవాడినని జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.
ఈ గడ్డమీద పుట్టిన వారెవరూ జయశంకర్‌ను మరిచిపోరన్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, జయశంకర్ జయంతి వేడుకలను జిల్లాలో మెదక్‌లో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కోరగానే, సీఎం కేసీఆర్ వెంటనే అనుమతించారన్నారు. తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తెలంగాణ వెనుకబాటు..ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడినప్పుడు జయశంకర్ ప్రత్యేకంగా ప్రశంసించారన్నారు. ఆయన ప్రశంసను ఎప్పటికీ మరచిపోలేనన్నారు.
అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా ఆయన తనను అభినందించారని గుర్తు చేసుకున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమమే ఊపిరిగా బతికాడన్నారు. తన 18వ ఏటనే నాన్ ముల్కి, ఇడ్లీ సాంబర్ గోబ్యాక్ ఉద్యమాల్లో పాల్గొని ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమ బీజాలు నాటారన్నారు. తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం చనిపోయే వరకు పోరాడాడని కొనియాడారు. తెలంగాణ సాధనలో ఆయన చేసిన కృషి, త్యాగం ఎప్పటికీ మరువలేమన్నారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ హైమద్ నదీం, మెప్మా పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ వనజాదేవి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, ఎంపీపీ లక్ష్మి కిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డిలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అలరించిన ఆటపాటలు
జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక జీకేఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంగారెడ్డికి చెందిన సత్యసాయి సేవా సమితి, మెదక్ వెలుగు, రెసిడెన్సియల్ స్కూల్, బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ఎనగండ్ల గ్రామ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ ఆటలు, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పాయి. చిన్నారుల ఆటపాటలతో పరవశించిన మంత్రి పద్మారావు ఒక్కో బృందానికి రూ.5 వేల చొప్పున నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి అయ్యాక తాను అత్యధికంగా సంతోష పడిన రోజు ఇదేనని ఆనందం వ్యక్తం చేశారు.