పాలనలో తప్పు జరిగితే ప్రశ్నించుడే..
♦ హామీల అమలుకు ఉద్యమానికైనా సిద్ధం
♦ తెలంగాణ రాష్ట్రం ఎవరో ఒక్కరు తెచ్చింది కాదు
♦ తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
గోదావరిఖని: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీగా ఏర్పడి ఉద్యమించిన తరహాలోనే ప్రభుత్వ పాలనలో ఏదైనా తప్పు జరిగితే కచ్చితంగా ప్రశ్నిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో పాలకులు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని, హామీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం తరహాలోనే హామీల అమలు కోసం మరో ఉద్యమం చేయడానికి జేఏసీ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎవరో ఒక్కరితోనే రాలేదని, సబ్బండవర్ణాలు చేసిన పోరాటం వల్లనే సాధ్యమైందని అన్నారు. తెలంగాణ కోసం జరిగిన సకలజనుల సమ్మెకు సింగరేణి కార్మికులే స్ఫూర్తిగా నిలిచారని, బొగ్గు అంటుకుని చల్లారని విధంగా గని కార్మికులు అనేక సందర్భాల్లో తమ ఉద్యమ రూపాన్ని ప్రదర్శించారని గుర్తు చేశారు. . తెలంగాణ ఏర్పడినందువల్లనే నదీ జలాల్లో వాటా దక్కిందని, వెయ్యి టీఎంసీల నీటిని పొందే అవకాశం కలిగిందని, తెలంగాణ వచ్చినందుకే కార్పొరేట్ శక్తుల పెత్తనం పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో విజయాన్ని ఆస్వాదించినట్లే.. పరిపాలనలో ఏవైనా తప్పులు దొర్లితే పాలకులను అడగవలసిన అవసరం ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు. ఇందుకోసం ప్రజలతో కలిసి నడిచేందుకు జేఏసీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కోదండరాం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, టీజేఏసీ నాయకులు పిట్టల రవీందర్, గురిజాల రవీందర్‌రావు, కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు సర్టిఫికెట్లు
తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్న ప్రతినిధులకు టీజేఏసీ తరఫున సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఈ సర్టిఫికెట్లను జేఏసీ తరఫున ఆయన సంతకం చేసి అందించారు. గోదావరిఖనిలో సుమారు 100 మందికి ఈ సర్టిఫికెట్లు అందించారు.