తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం
Published Mon, Aug 12 2013 4:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
కొరిటెపాడు (గుంటూరు), న్యూస్‌లైన్ :సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో అడ్డుకుంటామని నరసరావుపేట లోక్‌సభ సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి స్పష్టంచేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిరోజూ పార్లమెంట్ సమావేశాలకు హాజరై, ఈ ప్రాంత ప్రజల ఆవేదనను వినిపించేలా సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలపై సీమాంధ్ర విద్యార్థి, ఉద్యోగ జేఏసీ,ఎన్‌జీవోలు ఒత్తిడి తేవాలని సూచించారు. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాల్సింది పార్లమెంట్‌లోనేనని గుర్తుచేశారు.
సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తు ఊరుకోబోమని స్పష్టంచేశారు. హైదరాబాదు నగరంతోపాటు కృష్ణా, గోదావరి నదీజలాల సంగతి ముందుగా తేల్చాకే తెలంగాణపై ఆలోచించాలని హితవుపలికారు. ఆంటోనీ కమిటీ వల్ల సీమాంధ్రకు ఒరిగేదేమీ లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన జరిగితే ఎన్నో అనార్థాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు వెన్నా సాంబశివారెడ్డి, సీహెచ్ చిట్టిబాబు, ఎన్.విజయలక్ష్మి, కె.నాగేశ్వరరావు, సీహెచ్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement