మేం కోరం కోసమేనా? | Agitation JP members general meeting | Sakshi
Sakshi News home page

మేం కోరం కోసమేనా?

Published Wed, May 3 2017 3:18 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

మేం కోరం కోసమేనా? - Sakshi

మేం కోరం కోసమేనా?

‘‘అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యింది. రూపాయి కూడా మాకంటూ నిధులు కేటాయించలేదు. ఓట్లేసిన జనానికి మేమేం చెప్పాలి. మళ్లీ ఎన్నికలొస్తే ఎలా ముఖం చూపించాలి...చెప్పండి...ఇది మా ప్రభుత్వం అనుకుంటుంటే...మాకే చిల్లి గవ్వ కూడా నిధులు ఇవ్వడం లేదు. కేవలం సమావేశాలకు ‘కోరం’ కోసమే పనికొస్తామా?’’ అంటూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు.

 ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులతో పాటు ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ సభ్యులు కూడా తీవ్ర స్వరంతో జెడ్పీ సర్వసభ్య సమావేశంలో నిలదీశారు. మరో వైపు ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌పై సీనియర్‌ ఎమ్మెల్యే శివాజీ తనదైన శైలిలో సెటైర్లు సంధించగా.. అదే రూటులో ఈ ఇద్దరూ ఒకటై.., ఎంపీ రామ్మోహన్నాయుడుపై సెటైర్లు విసిరారు.  పాలకొండ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాత్రం తన నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావించారు. కాగా జెడ్పీ సమావేశం ఈసారి కూడా మొక్కుబడిగానే జరిగింది. మొత్తం 54 శాఖలపై చర్చ జరగాల్సి ఉండగా.. కేవలం 10 శాఖలతోనే ముగిసింది..

అరసవల్లి(శ్రీకాకుళం):  జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది. జెడ్పీటీసీ సభ్యుల నిధుల అంశం ఓ కుదుపు కుదుపేసింది. ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో పాటు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు, అధికార పార్టీ సభ్యులు కూడా గట్టిగా మాట్లాడటంతో వేదికపై ఉన్న ప్రభుత్వ విప్‌ రవికుమార్‌కు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. ముందుగా అధికార పార్టీ సభ్యులు వాసుదేవనాయుడు మాట్లాడుతూ మాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ప్రభుత్వం మాపట్ల ఇలాంటి చర్యలకు దిగడంపై మా రాష్ట్ర సంఘ ప్రతినిధుల పిలుపు మేరకు సమావేశానికి గైర్హాజరయ్యేందుకు సిద్ధమయ్యామన్నారు.

అయితే జిల్లాకు కొత్త కలెక్టర్‌గా వచ్చిన కె.ధనుంజయరెడ్డికి తొలి సమావేశం కావడంతోనే తాము సమావేశానికి వచ్చామంటూ చెప్పారు. తర్వాత సామంతుల దామోదరరావు, చింతు శకుంతలు మాట్లాడుతూ ఇది 40 మంది సభ్యుల ఉమ్మడి ఆవేదన అన్నారు. శ్రీరాముల నాయుడు మాట్లాడుతూ గ్రామాల్లోకి వెళితే ఏం చేశారని నిలదీస్తున్నారని, ఇదెక్కడి విధానమని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో సభ్యుడు లింగరాజు విప్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీలో ఎందుకు మా అంశం లేవనెత్తలేదని ప్రశ్నించారు.

తర్వాత వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు రాజగోపాలరావు, పాపినాయుడు, అన్నెపు రామకృష్ణలు మాట్లాడుతూ జెడ్పీటీసీల ప్రాదేశికాల అభివృద్ధి కోసం సభ్యులకు ప్రత్యేకంగా గత కలెక్టర్‌ 10 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయిస్తానని చెప్పారని, ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పరిధి గ్రామాల్లో ఒక్క బోరు కూడా వెయ్యలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులంతా ఇదే అంశంపై మాట్లాడుతుండగా, ప్రభుత్వ విప్‌ రవికుమార్‌ స్పందిస్తూ...ఇలా ఎంత సేపు ఇదే అంశం మాట్లాడుతారని అసహనం వ్యక్తం చేశారు. పలాస ఎమ్మెల్యే శివాజీ జోక్యం చేసుకుంటూ సభ్యులు నిధులు అడుగుతున్నారు.. మీరు కనీసం వారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా.  అడ్డుపడడం తగదన్నారు.

దీంతో విప్‌ రవికుమార్‌ మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం కమిషన్‌ వచ్చిన తర్వాత ఈ నిధులన్నీ జెడ్పీకి కాకుండా నేరుగా పంచాయతీలకే  కేటాయిస్తున్నారని, ఈ క్రమంలో జెడ్పీటీసీలకు ప్రత్యేక నిధుల కోసం జిల్లాకలెక్టర్‌ చర్యలుతీసుకోవాలని సూచించారు. దీనికి కలెక్టర్‌  ధనుంజయ రెడ్డి స్పందిస్తూ ఎస్‌డీపీ నిధులు,  గతంలో కేటాయిస్తామని చెప్పిన రూ. 10 కోట్ల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు జెడ్పీటీసీలకు ఎస్‌డీపీ నిధుల్లోంచి ఇవ్వాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు సూచించారు. ఎంపీ  ఇచ్చిన సూచనపై..ఇదో ఉచిత సలహా అంటూ శివాజీ...., ఎంపీ గ్రాంటులో నిధులు జెడ్పీటీసీలకు ఇవ్వాలంటూ.. రవి బాహాటంగానే సెటైర్లు విసిరారు.

విప్‌ రవి వర్సెస్‌ శివాజీ
సమావేశంలో తనదైన శైలిలో వివిధ ప్రభుత్వ శాఖాధికారులకు సమస్యలను చెబుతున్న ఎమ్మెల్యే శివాజీ, ప్రతి విషయంలోనూ విప్‌ రవికుమార్‌ జోక్యంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వ శాఖల పనితీరు, సభ్యుల ప్రశ్నలకు స్పందిస్తున్న తీరుపై శివాజీ మాట్లాడుతుండగా, విప్‌ రవి సమాధానాలు ఇస్తుండడంపై శివాజీ మండిపడ్డారు.‘విప్‌ గారూ...మీరు విప్‌ ఉపయోగించడానికి ఇది అసెంబ్లీ కాదు... ఓ ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతుంటే.. అలా వేదికపై నుంచి డిస్టర్బ్‌ చేస్తారా..అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం చట్టబద్ధత కోసం ఈ సమావేశాలు పెడుతున్నారు గానీ..ముఖ్యమైన అంశాలపై ముందు చర్చించండి. చాలు...మిగిలినవేవీ జరగవని అందరికీ తెలిసిందే..అని అనడంతో అధికారులు విస్తుపోయారు.

 మరో సందర్భంలో జెడ్పీటీసీ సభ్యులు అధికారులకు ప్రశ్నలేస్తుంటే, వారికి బదులుగా రవికుమార్‌ స్పందిస్తుండగా, శివాజీ జోక్యం చేసుకుంటూ పథకాల అమలు అధికారులు చేస్తారా...మీరు చేస్తారా..అంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో ఇప్పు డు ఇద్దరు మంత్రులున్నప్పటికీ కీలకమైన ఐటీడీఏ సమావేశం జరగలేదని విమర్శించారు. తర్వాత మరో సందర్భంలో ఎంపి రామ్మోహన్నాయుడు ఉచిత సలహాలిస్తున్నాడని, మరో ఏడాది పాటు ఎవ్వరికీ కనిపించడని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వచ్చే నెలలో పెళ్లి తర్వాత విహార యాత్రలంటూ ఏడాది పాటు మనకు కనపడడని ఎంపీపై శివాజీ సెటైర్‌ సంధించారు. దీంతో సభ్యులంతా కాసేపు నవ్వు కున్నారు.

 54 కి 10 శాఖలే!
జెడ్పీ సమావేశంలో మొత్తం 54 ప్రభుత్వ శాఖల ప్రగతి, పథకాల అమలు తీరుపై సమీక్ష జరగాల్సి ఉండగా, కేవలం 10 ముఖ్య శాఖలపైనే సమీక్ష జరిగింది.ప్రధానంగా మంచినీటిసరఫరా, ఆర్‌అండ్‌బీ,నీరు–చెట్టు డ్వామా, డీఆర్‌ డీఏ, జలవనరుల శాఖ, నీటి పారుదల అభివృద్ధి, సివిల్‌ సప్లయిస్‌ , పంచాయతీ రాజ్‌ తదితర శాఖలపై సభ్యులు అధికారులపై ధ్వజమెత్తారు. అయితే ప్రతిశాఖలోనూ బిల్లులకేటాయింపులునిలిచిపోయిన అంశాలపైనే సభ్యులు చర్చించారు.

తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు:కలెక్టర్‌
 గ్రామీణ నీటి సరఫరా ప్రస్తుతం ప్రాధాన్యతాంశమని, అందుకే రానున్న 40 రోజుల్లో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ధనుంజయరెడ్డి స్పష్టం చేశారు. అలాగే మండలానికి రూ. రెండు లక్షలు కేవలం తాగునీటి అవసరాలకు కేటాయించామన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ విషయంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మాట్లాడుతూ కంచిలి మండలంలో గత రెండు ఆర్థికసంవత్సరాల్లో 56 లక్షలతో ఎల్‌ఈడీ బల్బులు కొనుగోలు వెనుక పెద్ద అక్రమాలు జరిగాయని, దీనిపై సంబంధిత ఈవోపీఆర్డీపై ఆరోపణలున్నాయన్నారు.

అయితే ఈ వ్యవహారంపై డీపీవో కోటేశ్వరరావు విచారణాధికారిగా ఆరోపణలున్న అధికారినే నియమించారని మండిపడ్డారు. ఈ మేరకు విచారణ రిపోర్ట్‌ గతేడాది నవంబర్‌ 29న వస్తే ఇంతవరకు ఏచర్యలు తీసుకున్నారని డీపీవోను ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఓడీఎఫ్‌ గ్రామాల లక్ష్యంలో జిల్లా బాగా వెనబడిందని ఎంపీ రామ్మోహన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. 128 గ్రామాల లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 11 గ్రామాలే ఇప్పటికి పూర్తవ్వడం దారుణమన్నారు.

 మందస మండలం సువర్ణపురంలో 120 మరుగుదొడ్లకు ఇంకా బిల్లులు మంజూరు చేయలేదని ఎమ్మెల్యే శివాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజాంలో కేంద్ర మంత్రి అశోక్‌ ఇచ్చిన హామీలే ఇంతవరకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పట్టించుకోలేదని జెడ్పీటీసీ వాసుదేవ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలు శాఖల అధికారుల సమాధానాలపై విప్‌ రవి కుమార్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.  సమావేశంలో ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు, , జెడ్పీ సిఈవో బి.నగే ష్, డిప్యూటీ సీఈవో లక్ష్మీపతి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

మేం ‘కోరం’ కోసమేనా?
మేం చెప్తే పట్టించుకోరు..ఇప్పుడైనా స్పందించండి
– పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి


‘జెడ్పీటీసీ సభ్యులను పట్టించుకోవడం లేదంటూ నేను, మా పార్టీ సభ్యులు ఎన్ని సార్లు చెప్పినా..మీ చెవికెక్కలేదు...ఇప్పుడు అధికార పార్టీ సభ్యులే మూడేళ్లుగా నిధులు లేవని, ఇమ్మని అడుగుతున్నా రు. ఇప్పుడైనా వినండి...సభ్యుల ఆవేదనను అర్థం చేసుకోండి’ అని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ధ్వజమెత్తారు.  జెడ్పీటీసీ సభ్యుల నిధుల అంశంపై ఆమె విప్‌ రవి కుమార్‌ను ప్రశ్నించారు. గత కలెక్టర్‌ ఇచ్చిన హామీ ప్రకారం 10 కోట్ల రూపాయలను సభ్యులకు కేటాయించాలని సూచించారు. ప్రత్యేక నిధులుంటేనే జెడ్పీటీసీలకు గుర్తింపు ఉం టుందన్నారు.

అలాగే తన నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పథకాల అమలులో అధికార పార్టీకి చెంది న చోటా నాయకుల సిఫారసులకు అధికారులు తలొగ్గడంపైమండిపడ్డారు. కచ్చితంగా అర్హతుంటేనే లబ్ధిదారునిగా గుర్తించాలని, ప్రతిపక్ష నేతలంటే చులకన భావన కొంతమంది అధికారుల్లో ఉండడం దురదృష్టమని అసంతృప్తి వ్యక్తం చేశారు. భామిని, సీతంపేట మండలాల్లో ఎత్తిపోతల పథకాలు పనిచేయడం లేదని,  సింగిడి వద్ద ఇంతవరకు భూముల సేకరణనుచేపట్టకపోవడం, ఆయకట్టు ఖరారు చేయ కపోవడంపై నీటి పారుదల అభివృద్ధి శాఖ ఈఈ లక్ష్మీపతిని ప్రశ్నించారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ప్రస్తుత సీజన్‌లో బోర్‌మెకానిక్‌లు లేరని, ఉన్నవారికి జీతా లు కూడా ఇవ్వడం లేదంటూ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉన్న ఇందిర ప్రభ పథకానికి కొత్త పేరుగా వచ్చిన ఎన్టీఆర్‌ జలసిరి కింద తన నియోజకవర్గంలో అర్హులకు కూడా పథకం అమలు కావ డం లేదన్నారు. ఇంతవరకు ఒక్క బోరు కూడా వేయలేని ఆ పథకం ఎవ్వరి కోసమని మండిపడ్డారు. పాలకొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఇంకుడు గుంతల బిల్లులు నిలిచిపోయాయని, ఈ విషయంలో అధికారుల తీరు బాగోలేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement