
ఎయిడెడ్ ఉపాధ్యాయుల నియామకాలపై ఆంక్షలు ఎత్తివేయండి
విజయవాడ(గాంధీనగర్) : ఎయిడెడ్ ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్షుడు వై.దేముడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్‌ఆర్‌ఎస్‌వీ బీఈడీ కళాశాలలో ఎయిడెడ్ స్కూళ్ల టీచర్స్ గిల్డ్ కృష్ణా జిల్లా శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఉపాధ్యాయులకు రెండు విడతల డీఏ నిలిచిపోయిందని తక్షణమే చెల్లించాలన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల నుంచి లక్షల రూపాయల రికవరీకి కారణమైన జీవో 37ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. ఎయిడెడ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షుడు ఏవీఆర్ ప్రసాద్, అధ్యక్షుడు పి.పాల్, ప్రధాన కార్యదర్శి వీవీ రమణమూర్తి, ఆర్థిక కార్యదర్శి బ్రహ్మారెడ్డి, కార్యదర్శులు సుధీర్‌బాబు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.