గోదావరి బుల్లోడు అక్కినేని
రాజమండ్రి కల్చరల్ : మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మన మధ్యనుంచి నిష్ర్కమించి అప్పుడే ఏడాది గడిచింది. గోదావరి జిల్లాలతో అవినాభావ అనుబంధం ఆయనకు ఉంది. గోదావరి తీరాన రూపు దిద్దుకున్న అక్కినేని సినిమాలు చరిత్ర సృష్టించాయి.
1963లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన మూగమనసులు కోటిపల్లి రేవు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. అన్నపూర్ణా పిక్చర్స్ బ్యానర్‌పై వచ్చిన పూలరంగడు షూటింగ్ కపిలేశ్వరపురంలో జరిగింది. 1969లో బాపు, రమణల బుద్ధిమంతుడు పులిదిండి, ర్యాలి గ్రామాలలో నిర్మాణమైంది. 1997లో విడుదలైన ఆత్మీయుడు తాపేశ్వరం లాకుల వద్ద, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిత్రీకరణ చేసుకుంది. 1982నాటి మేఘసందేశం సన్నివేశాల షూటింగ్ దోసకాయలపల్లి, నందరాడ గ్రామాల్లో జరిగింది.
1970లో విడుదలయిన ఇద్దరమ్మాయిలు షూటింగ్ సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీలో జరిగింది. ఆ తరువాత వచ్చిన సూత్రధారులు షూటింగ్ అన్నవరం, మిర్తిపాడు, తొర్రేడు, కపిలేశ్వరపురం గ్రామాల్లో జరిగింది.సీతారామయ్యగారి మనుమరాలు షూటింగ్ కోనసీమలో జరిగింది. మాధవయ్యగారి మనుమడు మిర్తిపాడు, తొర్రేడు గ్రామాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చివరిసారిగా అక్కినేని 2013 జనవరి 9న గైట్ కళాశాల వార్షికోత్సవాలకు రాజమండ్రి వచ్చి షెల్టాన్ హోటల్ 614 గదిలో ఉన్నారని ఆయన అభిమాని అడబాల మరిడయ్య తెలిపారు.