మనసులు మూగబోయాయ్
Published Thu, Jan 23 2014 4:57 AM | Last Updated on Tue, Jul 31 2018 5:31 PM
అక్కినేని నాగేశ్వరరావు ఆడపిల్ల వేషం వేసి రంగస్థలంపై కనిపిస్తే.. చూసినోళ్లంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు. ఇది సుమారు ఏడున్నర దశాబ్దాల క్రితం మాట. సినీ రంగంలో అడుగిడక ముందే.. మన జిల్లా అల్లుడు కాకముందే అక్కినేనికి ‘పశ్చిమ’తో అనుబంధం ఉంది. 1940కి ముందునుంచి 1944 వరకూ భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు, ఉండి, నవుడూరు, పాలకొల్లు ప్రాంతాల్లో అక్కినేని నాటక ప్రదర్శనలు ఇచ్చారు. దెందులూరు ఆడపడుచు అన్నపూర్ణమ్మను వివాహం చేసుకున్న ఆయన ఆమె పేరిట ఏలూరులో పల్వరైజింగ్ మిల్లు నెలకొల్పారు. ఏటా సంక్రాంతి నాడు ఆ మిల్లుకు వచ్చేవారు. కార్మికులందరినీ పేరుపేరునా పలకరించేవారు. కొత్త దుస్తులు ఇచ్చి మరీ వెళ్లేవారు.
ఆదుర్తి సుబ్బారావు నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిన తెరకెక్కి మూగమనసులు సినిమా చాలాభాగం నరసాపురంలోనే షూటింగ్ పూర్తిచేసుకుంది. అవుట్ డోర్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం.. నాగేశ్వరరావు సహా అందులో నటించిన వారందరికీ మంచి పేరు తెచ్చినదీ ఇదే కావడం విశేషం. నాగేశ్వరరావు నటించిన ఇలాంటి సినిమాలెన్నో ‘పశ్చిమ’లో క్లాప్ తీసుకున్నారుు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటానికే అలవాటు పడిన నట సామ్రాట్ అక్కినేని అశేష అభిమానులను దుఃఖసాగరంలో ముంచి.. దివికేగిన తన భార్య అన్నపూర్ణమ్మ చెంతకు వెళ్లిపోయూరు. సినీ వినీలాకాశంలో మేరునగధీరుడిలా.. మహా నిఘంటువులా.. అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రలా మిగిలిపోయూరు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. నాటకాలు వేసే రోజుల్లోనే అది కొనసాగగా దెందులూరు ఆడపడుచును పెళ్లాడాక మరింత బలపడింది. ఆయన ఈ లోకం నుంచి భౌతికంగా దూరం కావడం అభిమానులను దుఃఖ సాగరంలో ముంచెత్తుతోంది.
దెందులూరు, న్యూస్‌లైన్ : అక్కినేని నాగేశ్వరరావు మరణవార్తతో ఆయన అత్తవారు ఊరైన దెందులూరు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బంధువులతో పాటు స్నేహితులు, అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం తెల్లవారుజామున పలువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
దెందులూరు అల్లుడు
దెందులూరులో కొర్లిపర వెంకట నారాయణ, నాగభూషణమ్మ దంపతులకు రామ కుటుంబరావు, అన్నపూర్ణమ్మ సంతానం. అన్నపూర్ణమ్మను అక్కినేని నాగేశ్వరరావు 1949 ఫిబ్రవరి 18లో వివాహం చేసుకున్నారు. అక్కినేని సతీమణి, అత్తామామలు, బావ ఇప్పటికే కాలం చేశారు. ప్రస్తుతం గ్రామంలో అక్కినేని బావ కుమారుడు సుబ్రహ్మణ్యవర ప్రసాద్, కోడలు నాగమణి కుటుంబ సభ్యు లు ఉంటున్నారు.
సంక్రాంతికి ఇక్కడే..
వివాహం అనంతరం ప్రతి సంక్రాంతికి అక్కినేని దెందులూరు వచ్చేవారు. పెద్ద పెద్ద దుంగలు పోగుచేసి భోగి మంటలు వేసేవారు. నువ్వుల అరిసెలు, పా యసం, పులిహోర, దెందులూరు వంకాయలతో చేసిన కూర అమితంగా ఇష్టపడేవారు. పండగ మూడు రోజులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో గడిపేవారు. అభిమానులకు ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్‌లు ఇచ్చేవారు. అత్తారింటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ అభిమానంగా పేరుపెట్టి మరీ పలకరించేవారు.
బంధువులు.. స్నేహితులు
దెందులూరులో బంధువులు కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి ఆంజనేయచౌదరి (అబ్బులు), వీరమాచినేని సురేంద్రచౌదరితో ఎక్కువగా మెలిగేవారు. మేనల్లుడు వీరమాచినేని శివాజీతో వ్యవసాయంపై చర్చించేవారు. శ్రేయోభిలాషులు వడ్లపట్ల నాగభూషణం, ఘంటా బాబూరావుతో గ్రామంలోని సంగతులపై ఆరా తీసేవారు.
ఏలూరులో వ్యాపార సంస్థలు
అక్కినేని ఏలూరులో అన్నపూర్ణ ఫ్లోర్‌మిల్, పల్వరైజింగ్ వ్యాపార సంస్థలను నిర్వహించారు. ఆయనకు ఏలూరులో వ్యవసాయక్షేత్రం కూడా ఉంది. శ్యామల, నవయుగ, లక్ష్మీ ఫిలింస్, అన్నపూర్ణ సినీ చిత్ర సంస్థలతో అనుబంధం ఉండేది.
వ్యవసాయంపైనే చర్చలు
మామయ్య ఎక్కువగా వ్యవసా యం, ప్రకృతి, ఖ ర్చు, ప్రాంతాల వారీ గా పంట దిగుబడుల వ్యత్యాసంపైనే నాతో చర్చించేవారు. వ్యవసాయంపై ఆయనకు ఉన్న మక్కువను ఎన్నటికీ మరువలేను. కుటుంబ సంబంధాలు, జీవన విధానం, గౌరవ మర్యాదలలో అక్కినేని అందరికీ ఆదర్శప్రాయుడు.
- వీరమాచినేని శివాజీ, మేనల్లుడు
మాటల్లో, ఆదరణలో ప్రత్యేకత
అక్కినేని నాగేశ్వరరావు మాటల్లో, ఆదరణలో చూపిన ప్రత్యేకత ఎన్నడూ మరువలేను. అన్ని పరిస్థితులపై వాకబు చేసే విధానం, వ్యక్తిపై ఆసక్తి, స్పష్టత, సమయం కేటాయింపు వంటివి ఆయనలో ఉన్న సద్గుణాలు.
- వడ్లపట్ల నాగభూషణం, శ్రేయోభిలాషి
నరసాపురంలో ‘మూగమనసులు’
నరసాపురం టౌన్ : ‘ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసులు.. వెనుక జన్మ బాసలు ఎవ్వరికీ తెలుసులే’ పాట వింటే అక్కినేని నటించిన మూగమనసులు చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంతోనే అక్కినేనికి నరసాపురంతో అనుబంధం ఏర్పడింది. 1963లో మూగమనసులు సినిమా 90 శాతం చిత్రీకరణ నరసాపురంలో జరిగింది. ఈ సందర్భంగా చాలా రోజులపాటు నాగేశ్వరరావు ఇక్కడే బసచేశారు.
పలు సన్నివేశాల చిత్రీకరణ
నరసాపురంలోని వలంధర రేవు, ఓసూరివారి తోట, మాధవాయపాలెం పడవల రేవు, తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవుల్లో చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. ‘గోదావరి గట్టుంది గట్టుమీద చెట్టుంది.. చెట్టుమీద పిట్టుంది’, ‘నా పాట నీ నోట పలకాలి చిలక’ పాటలను ఇక్కడే చిత్రీకరించారు.
ఇప్పటికీ మూగమనసుల మేడుంది
సినిమాలో ఏఎన్‌ఆర్ నివాసానికి సఖినేటిపల్లి రేవులో, సావిత్రి నివాసానికి ఓసూరివారి తోటలో సెట్టింగులు వేశారు. అప్పటి మునిసిపల్ చైర్మన్ కురిశేటి కృష్ణమూర్తి గుర్రపుబండిని చిత్రంలో వినియోగించారు. ఓ సూరి వారి తోటలో ఓ బిల్డింగ్‌ను ‘మూగమనసులు మేడ’గా ఇప్పటికీ ప్రజలు పిలుస్తుంటారు. నాటకాలు వేసే రోజుల్లో నరసాపురం వచ్చిన ఆయన ఓ రాత్రి కుమ్మరి వీధి రామాలయంలో నిద్రపోయారు.
గోదావరి తీరం.. వి‘చిత్ర’ బంధం
కొవ్వూరు : గోదావరి నది పరీవాహక ప్రాంతంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పలు సినిమాలు తెరకెక్కాయి. 1963లో మూగమనసులు, 1973లో అందాలరాముడు, 1982లో మేఘసందేశం, 1990లో సీతారామయ్యగా రి మనుమరాలు, మాధవయ్యగారి మనుమడు వం టి సినిమాలను గోదావరి తీరంలో చిత్రీకరించారు. మేఘసందేశం షూటింగ్ ఎక్కువగా పోలవరంలో జరిగింది. సీతారామయ్యగారి మనవరాలు చిత్రం షూటింగ్‌లోని పలు సన్నివేశాలను తాళ్లపూడి మండలం మలకపల్లిలోని కుంటముక్కల వారి భవనంలో, సింగన్నపల్లి సమీపంలో గోదావరి ఒడ్డున తెరకెక్కించారు.
అక్కినేని ఔదార్యం
పాలకొల్లు, న్యూస్‌లైన్ : పాలకొల్లులో 1940లో మునిసిపల్ హైస్కూల్ భవన నిర్మాణానికి ఆశాజ్యోతి, తెలుగుతల్లి, సత్యాన్వేషణ అనే నాటికలు ప్రదర్శించగా స్త్రీపాత్రలో అక్కినేని నటించారు. నాటిక వేసేందుకు కృష్ణా జిల్లా ముదినేపల్లి నుంచి ఆయన గుర్రపుబండిలో వచ్చేవారు. నాటక ప్రదర్శన ల్లో వచ్చిన సొమ్మును ప్రయాణ ఖర్చులు పోను మిగిలింది హైస్కూలు నిర్మాణానికి విరాళంగా అందజేశారు. అక్కినేని 60 చిత్రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 1956లో పాలకొల్లులో అభిమానులు ఆయన్ను సత్కరించారు. మూగమనసులు షూ టింగ్ సందర్భంగా మరోసారి సత్కరించారు. దర్శకులు దాసరి, కోడి రామకృష్ణ ఆధ్వర్యంలో అక్కినేని ఇక్కడ సత్కరాలు అందుకున్నారు.
ఏలూరులో జ్ఞాపకాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): శ్యాంప్రసాద్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘విజయ’శత దినోత్సవం సందర్భంగా అక్కినేని తొలిసారి ఏలూరు వచ్చారు. మొదట్లో నగరానికి చెందిన కొల్లి అంజయ్య నాటక సమాజంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేశారు. అదే సమాజంలో నాటక ప్రదర్శనలిచ్చారు.
బీవీ రాజు పాఠశాల ప్రారంభం
నటసామ్రాట్‌ను 2001లో డాక్టర్ బీవీ రాజు భీమవరం తీసుకువచ్చారు. స్థానిక ఏడో వార్డులోని బీవీ రాజు మునిసిపల్ ఎలిమెంటరీ పాఠశాలను అక్కినేనితో ప్రారంభింపజేశారు. అనంతరం అక్కినేని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇలా ఆ రోజంతా ఆయన భీమవరంలోనే గడిపారు.
- న్యూస్‌లైన్ / భీమవరం కల్చరల్
Advertisement