మద్యం దుకాణాలపై ఎక్సైజ్ డీసీ దాడులు | Alcohol excise DC attacks on shops | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాలపై ఎక్సైజ్ డీసీ దాడులు

Published Tue, Aug 12 2014 1:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

మద్యం దుకాణాలపై ఎక్సైజ్ డీసీ దాడులు - Sakshi

మద్యం దుకాణాలపై ఎక్సైజ్ డీసీ దాడులు

శ్రీకాకుళం క్రైం: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మద్యం దుకాణాలపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి దాడులకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న దుకాణాలపై ‘అధికారులకు మామూళ్ల కిక్కు... ప్రజలకేది దిక్కు’ శీర్షికతో ‘సాక్షి’ సోమవారం ప్రచురించిన కథనంపై ఆమె స్పందించారు. కిందిస్థాయి అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతే ఆమె నేరుగా రంగంలోకి దిగారు. ముందుగా జెడ్పీ వద్ద ఉన్న శ్రీసాయినాధ్ వైన్స్ దుకాణానికి వెళ్లారు. అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దుకాణాన్ని మార్చాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించిన సంగతి తెల్సిందే. దీనిపై డీసీ స్థానికులతో మాట్లాడారు. ఈ దుకాణంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దాన్ని తరలించాలని మహిళలు చెప్పారు.
 
 నిబంధనల ప్రకారమే దుకాణం ఏర్పాటు చేశారని డీసీ అన్నారు. అయితే స్థానికులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని మార్పుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దుకాణం మార్చడానికి కొద్ది రోజులు వ్యవధి ఇస్తామని అప్పటివరకూ అటువైపు వెళ్లవద్దని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ దుకాణం మార్చాలని ఇప్పటికే ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు చెప్పినట్లు తెలిపారు. మార్పు విషయంలో శాఖాపరంగా కొంత రికార్డు వర్కు చేయాల్సి ఉందన్నారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉన్న విజయలక్ష్మి మద్యం దుకాణాన్ని పరిశీలించారు. 30 పడకల ప్రైవేట్ ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణం ఉండకూడదని యజమానికి డీసీ చెప్పారు.
 
 దీనిపై యజమాని మాట్లాడుతూ ఆస్పత్రి ప్లాన్ ప్రకారం కాకుండా ఉండడంతో తమ దుకాణం వంద మీటర్ల లోపులకు వచ్చిందని వివరించారు. అయితే ప్లాన్‌తో సంబంధం లేదని, గేటు నుంచి 100 మీటర్ల దూరం పరిగణిస్తామని డీసీ బదులిచ్చారు. దీంతో 100 మీటర్లు లోపు లేకుండా దుకాణాన్ని వెనక్కు మార్పు చేస్తామని యజమాని తెలియజేశారు. ఆమె వెంట శ్రీకాకుళం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.ఏసుదాసు, పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుకేష్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement