మద్యం డిపోలో దోపిడీ
వ్యాపారుల నుంచి ముక్కు పిండి వసూళ్లు
అంతా తానై చక్రం తిప్పుతున్న అధికారి అన్‌లోడింగ్‌కూ మామూలివ్వాల్సిందే హమాలీల కూలిలోనూ వాటా చీప్ లిక్కర్ పంపిణీలో చేతివాటం
తిరుపతి: తిరుపతి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో మద్యం వ్యాపారులకు వడమాలపేటలోని మద్యం గోడౌన్ సిబ్బంది చుక్కలు చూపుతున్నారు. డబ్బులు ముట్టజెప్పందే సరుకు ఇవ్వడం లేదు. ఇండెంట్ ఇచ్చిన ప్రతిసారీ డీడీతో కలిపి రూ.300 ఇస్తేనే సంతకం పెట్టి స్టాకు ఇస్తున్నట్లు మద్యం వ్యాపారులు పేర్కొంటున్నారు. లేకపోతే సరుకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నట్లు వాపోతున్నారు. ఓ మద్యం దుకాణం యజమాని సరుకుకోసం సరాసరిన నెలలో 20సార్లు గోడౌన్‌కు వెళ్తారు. ఇలా సగటున నెలకు మద్యం దుకాణదారుడు రూ6,000లు సమర్పించుకోవాల్సి వస్తోంది. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని 224 మద్యం దుకాణాదారుల నుంచి దాదాపు రూ.13లక్షలకు పైగా మాముళ్ల రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం
అన్‌లోడ్ చేయాలంటే..
మద్యం గోడౌన్‌లోకి పలు కంపెనీల నుంచి మద్యం సరఫరా అవుతోంది. ఇలా గోడౌన్‌కు సరుకుతో వచ్చిన లారీ అన్‌లోడ్ కావాలంటే డ్రైవర్ రూ.500 ఇవ్వాలి. దాంతోపాటు ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి లారీకి రూ.1,000లు ముట్టజెప్పాలి. లేకుంటే అన్‌లోడ్ చేయకుండా లారీని అక్కడే నిలిపివేసి ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. సరుకును సిబ్బంది, సంబంధిత కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే అన్‌లోడ్ చేయాలి. అయితే కంపెనీ ప్రతినిధులను లోనికి రాకుండా, నేరుగా అక్కడి ఉద్యోగులే అన్‌లోడ్ చేయిస్తున్నట్లు తెలిసిం ది. 10, 15 బాటిళ్లు పగిలితే. ఎక్కువ సంఖ్యలో బాటిళ్లు పగిలిపోయినట్లు లెక్కచూపి, వాటిని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కూలీలనుంచి..
మద్యం గోడౌన్‌లో ఒక కేసు అన్‌లోడ్ చేస్తే రూ.4, మద్యం షాపులకు సరఫరా చేసేందుకు కేసుకు రూ.5 చొప్పున అక్కడ హమాలీలకు ఇస్తారు. నెలకు దాదాపు 2,40,000కేసుల మద్యం అన్‌లోడ్ చేస్తారు. అయితే అన్‌లోడ్ అయిన కేసులకు సంబంధించి కూలీలకు ఇచ్చే మొత్తంలో కేసుకు రూపాయి వంతున సిబ్బందికి హమాలీలు మాములు ఇవ్వాల్సిందేననని పలువురు పేర్కొంటున్నారు. ఇలా హమాలీల నుంచి నెలకు రూ2.4 లక్షలు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తం కలిపి నెలకు దాదాపు రూ.20 లక్షలకు పైగా సిబ్బంది మూముళ్ల రూపంలో పసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దందా అంతా అక్కడ పనిచేసే ఓ అధికారి కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి విషయంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నట్లు మద్యం వ్యాపారులు వాపోతున్నారు.
చీప్ లిక్కర్‌లో చేతివాటం
చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ ధర రూ.60 నుంచి 45లకు తగ్గించిన నేపథ్యంలో చీప్ లిక్కర్‌కు డిమాండ్ పెరిగింది. ధర తగ్గిన నేపథ్యంలో కంపెనీకి ఆదాయం తగ్గడంతో నెలకు 30,000లకు పైగా వస్తున్న చీప్ లిక్కర్ కేసులు కేవలం గత నెలలో 19,000లు మాత్రమే వచ్చాయి. ఈలెక్కన తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో సగటున ఒక మద్యం దుకాణానికి 100 కేసుల లోపు మాత్రమే వస్తాయి. అయితే గోడౌన్‌లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించి మూడు దుకాణాలకు 2,500 కేసులు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వేటు వేసినా..
గోడౌన్‌పై మద్యం పంపిణీకి సంబంధించి పలురకాల ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. ఈ నేపధ్యంలో వారు ఆకస్మిక తనిఖీలు చేశారు. బాధ్యులైన ముగ్గురు సిబ్బందిపై వేటు వేశారు. మళ్లీ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే గాని అక్కడి సిబ్బందిలో పనితీ రు మారదని మద్యం వ్యాపారులు వాపోతున్నారు.
ప్రక్షాళన చేశా
నేను విధుల్లో చేరినప్పటి నుంచి పూర్తిగా విధానాలను మార్చి ప్రక్షాళన చేశా. సీరియల్ ప్రకారమే లారీల అన్‌లోడింగ్ జరుగుతోంది. ప్రతిదీ మ్యాన్యువల్ లేకుండా స్కానింగ్ చేస్తున్నాం. సిబ్బందికి డబ్బులు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తం. కొంతమంది మద్యం కంపెనీల సిబ్బందికి, గోడౌన్‌లో పనిచేసే సిబ్బందికి పొసగక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. - దయాసాగర్, మద్యం గోడౌన్ మేనేజర్