ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే : కేసీఆర్ | All Andhra people are against to Telangana, says K Chandra sekhar rao | Sakshi
Sakshi News home page

ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే : కేసీఆర్

Published Mon, Sep 30 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

All Andhra people are against to Telangana, says K Chandra sekhar rao

* కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ, టీడీపీ కలసినా తెలంగాణ వెంట్రుక కూడా పీకలేరు
* తెలంగాణ ఉద్యమం కోడి కూత.. సీమాంధ్ర ఉద్యమం అలారం కీ...
* సీఎం ఆరే దీపం.. అక్టోబర్‌ 6 దాటడు.. స్విచాఫ్‌ అవుతది.. ప్లగ్‌ పీకేస్తరు
* సున్నితంగా, హుందాగా వ్యవహరించాల్సిన మేధావులు ఆంధ్రాలో లేరుసాక్షి, హైదరాబాద్: ‘‘లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే. ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే. జగన్‌బాబు, చంద్రబాబు, కిరణ్‌కుమార్ అని కాదు. ఆంధ్రోళ్లంతా దోచుకునేటోళ్లే’’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, ఏనుగు వెళ్లి తోక చిక్కిందని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలంతా కలిసినా తెలంగాణ వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో గంభీరంగా, హుందాగా, సున్నితంగా వ్యవహరించాల్సిన మేధావులు అంధ్రా ప్రాంతంలో లేరన్నారు. ‘ఆంధ్రలో మేధావి అనేటోడు ఉన్నాడా అనే డౌట్ ఉన్నది. మానసికంగా విడిపోయిన ఈ సమయంలో కలసి ఉండాలని ఏ బేవకూఫ్ అనడు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో హైదరాబాద్‌పై కిరికిరి పెడితే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలన్నారు.
 
 ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సకల జనభేరిలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం కోడికూతలాగా సహజమైనదని, సీమాంధ్ర ఉద్యమం అలారం మోతలా ఎవరో కీ ఇస్తే తప్ప మోగదని వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో ఉద్యమం ఒక ఉద్యమమేనా అని ప్రశ్నించారు. కొరడాలతో కొట్టుకోవడం, కోడి ఈకలు కట్టుకోవడం, గడ్డితినడం, సమాధుల మీద పడుకోవడం ఏం దిక్కుమాలిన ఉద్యమమని అని ఎద్దేవా చేశారు. ఉద్యమ బిడ్డలు సింహాల్లా ఉంటారని అన్నారు. 40 వేల మంది సీమాంధ్ర సభలో జై తెలంగాణ అని పోలీసు శ్రీనివాస్ నినదించడమే ఉద్యమం అన్నారు. అన్ని వేల మంది సభలో ఒంటరిగా పోయి నినదించడానికి ఎంతో గుండెదిటవు కావాలన్నారు. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే ఉంటుందని, కుందేళ్లు, తోడేళ్లు మాత్రమే సమూహాలుగా వస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అశోక్‌బాబు సమైక్యాంధ్ర కోసం నినదిస్తుంటే కొట్టకుండా శ్రీనివాస్‌పై దాడికి ఎందుకు దిగారని అడిగారు.
 
 సీఎం కిరణ్ ఆరిపోయే దీపం...
 రాష్ట్ర విభజనకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలేనని కేసీఆర్ విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపం. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. అక్టోబరు 6 దాటడు. స్విచ్ఛాఫ్ అయితది. కిరణం బొగ్గు అయితది. డీజీపీ దినేశ్‌రెడ్డికి కోర్టు కట్ చేసింది. కిరణ్‌కు కూడా ప్లగ్‌ను పీకేస్తరు’’ అని జోస్యం చెప్పారు. తెలంగాణతో పెట్టుకున్న చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి బాగుపడలేదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా పోయేకాలం వచ్చిందని హెచ్చరించారు. ఒక ప్రాంత ప్రజల గురించి మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కు తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టవా అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఎంతో దక్షతతో, గంభీరంగా వ్యవహరించి ఇరుప్రాంతాల వారిని సమన్వయం చేసి విభజన సమస్యను సున్నితంగా పరిష్కరించాల్సిన బాధ్యత కిరణ్‌పై ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించే తెలివిలేకుంటే, జీర్ణం కాకుంటే  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘‘సీఎం కిరణ్‌ను తెలంగాణ ఆడబిడ్డలు సైతం బేవకూఫ్ అని తిడుతున్నా ఇజ్జత్ , మానం ఉన్నోడైతే సీఎంగా ఉంటడా?’’ అని ప్రశ్నించారు. ఇంకా సమైక్య ఉద్యమ జేఏసీ కన్వీనర్‌గా కిరణ్‌కుమార్ ఉద్యమాన్ని నడిపిస్తున్నడని విమర్శించారు.
 
  దిగ్విజయ్‌సింగ్‌కు ఇదే చెప్పినామని, సరైన సమయంలో పద్ధతి ప్రకారం పని చేద్దామని దిగ్విజయ్ చెప్పినట్టుగా కేసీఆర్ వెల్లడించారు. సీఎం ఇకనైనా మారతాడో, బుద్ధి అట్లానే ఉంటదో రాబోయే రోజుల్లో తెలుస్తదని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద సొరంగాన్ని పెద్దగా చేసి సీమాంధ్రలో 330 టీఎంసీల సామర్థ్యపు ప్రాజెక్టులను అక్రమంగా, దౌర్జన్యంగా పూర్తిచేశారని కేసీఆర్ ఆరోపించారు. 90 టీఎంసీల కేటాయింపులుంటే 330 టీఎంసీలను దోచుకుంటున్నామని సీఎం స్వయంగా ఒప్పుకున్నాడన్నారు. 100 టీఎంసీల నీరు ఇస్తే పాలమూరు వలసలు ఆగిపోతాయని, ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తే నల్లగొండ జిల్లా బతుకులు బాగుపడ్తాయని పేర్కొన్నారు.
 
 తెలంగాణ ప్రజలు ప్రజలు కారా?
 ‘‘పచ్చ పార్టీ చంద్రబాబుకు బతుక్కు ఎన్ని టర్నులుంటయి. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత సీమాంధ్రకు 5 లక్షల కోట్లతో ప్యాకేజీ ఇవ్వాలన్నడు. ఇపుడు సీమాంధ్ర మనోభావాలు పేరుతో ప్రజల టర్న్ అంటున్నడు. సకలజనుల సమ్మెలో లక్షలాది మంది రోడ్లమీదకొచ్చినా.. 1,000 మంది ఆత్మబలిదానం చేసుకుంటే వారి తల్లులు గర్భశోకంలో ఉన్నా.. చంద్రబాబు బయటకు రాలేదు. అప్పుడు ప్రజల టర్న్ ఎందుకు తీసుకోలేదు? తెలంగాణ ప్రజలు ప్రజలే కారా? వారికి మనోభావాలు ఉండవా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రోళ్లు గాయిగాయి చేయగానే కేంద్రం బిత్తరపోయి నిర్ణయం తీసుకోవద్దన్నారు.

 

నష్టపోయి, కష్టపడ్డ తెలంగాణకే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రాణిహిత-చేవెళ్ల, కల్వకుర్తి ప్రాజెక్టులు రెండింటికీ జాతీయ హోదా కల్పించాలని కోరారు. తెలంగాణకు కావాల్సినవేంటో తమ ఢిల్లీ పర్యటనలో పెద్దలకు వివరించినట్లు కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా 10 ఏండ్లు ఉండనీ అంటే సీమాంధ్రుల పట్ల సానుకూల వైఖరితో ఉన్నట్టుగా కొందరు తనను తప్పుబట్టారని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రా ఖజానా నుండి జీతాలు తీసుకుని, తెలంగాణలో ఖర్చు చేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. వీరివల్ల వచ్చే ఆదాయంతో తెలంగాణవాసులకు లాభాలు చేకూరుతాయన్నారు.
 
 సమన్యాయం జరిగే అవకాశమే లేదు...
 వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నట్టు సమన్యాయం జరిగే అవకాశమే లేదన్నారు. అసలు న్యాయమే లేకుంటే ఇంక సమన్యాయం ఎక్కడిదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటవుతున్న ఈ తరుణంలో ఏ మాత్రం తప్పటడుగులు వేసినా భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్టు అవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచేయడానికి ఎన్నో కుట్రలు చేసినా ఇప్పటిదాకా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నిజాం కాలేజీలో సభ అంటే స్థలం సరిపోదని తాము భావించామని జనాన్ని చూస్తే అదే నిజమని స్పష్టమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిపే సభ 60-70 ఎక రాల్లో నిర్వహించుకుందామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్న బీజేపీ అగ్రనేతలు సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యూపీఏ గోల్‌మాల్ చేసినా తెలంగాణ కోసం జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని వారు అందించారని కితాబిచ్చారు. త్వరలోనే తెలంగాణ విజయఢంకా మోగుతుందని, హైదరాబాద్‌పై ఏ మాత్రం కిరికిరి చేసినా మరోసారి ఉద్యమబావుటాను ఎగురేయడానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement