హైదరాబాద్‌పై అందరికీ హక్కుంది!
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా ఉద్యమబాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం కూడా తమ నిరసనలు కొనసాగించారు. హైదరాబాద్‌పై తెలుగువారందరికీ సమాన హక్కు ఉందని నినదించారు. రాష్ట్ర విభజనపై యూపీఏ ప్రకటనకు నిరసనగా సామూహికంగా తపస్సు చేశారు. ఉద్యోగులందరమూ ఏపీపీఎస్సీ ద్వారా ప్రతిభ ఆధారంగా నియమితులైనవారమేనని, ఇందులో ఎవరూ అక్రమంగా ఉద్యోగం పొందినవారు లేరని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో ఉండే హక్కు ప్రతి ఉద్యోగికీ ఉందని, ఇందుకు ఎవరి అనుమతి అవసరం లేదంటూ నుదుట తెల్లబ్యాడ్జీలు కట్టుకుని.. సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం కార్యాలయం ఉండే సమతా బ్లాక్ ఎదుట బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆ సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలోనే ఉన్నారు. అనంతరం సచివాలయ సీమాంధ్ర ఫోరం కో కన్వీనర్ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రుల ఉద్యమాన్ని అర్థం చేసుకుని కేంద్రం తన ప్రకటనను వెనక్కు తీసుకోవడంద్వారా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. రాష్ట్ర విభజన అంశంపై అసెంబ్లీలో చర్చ నిర్వహించి అన్ని ప్రాంతాల శాసనసభ్యులు తమ అభిప్రాయాలు వినిపించేందుకు అవకాశం కల్పించాలన్నారు. సీమాంధ్ర ఉద్యమంపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యోగులు నెలల తరబడి విధులు వదిలి ఆందోళన చేపట్టినప్పుడు.. తాము పూర్తిగా సహకరించామని, అదేరీతిలో ఇప్పుడు హక్కులకోసం పోరాడుతున్న తమపై నిందలు వేయడం సహేతుకం కాదని హితవు పలికారు.
తమ ఆందోళన తమ హక్కులకోసమే తప్ప ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా కాదని వివరించారు. ఇరుప్రాంతాల ఉద్యోగులమధ్య సుహృద్భావ వాతావరణం చెడగొట్టేందుకు కొందరు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వాటికి తాము ప్రతిస్పందించబోమని చెప్పారు. ఓటు హక్కున్న ప్రతిఒక్కరూ రాజకీయ అంశాలపై పోరాడవచ్చని, అది రాజ్యాంగం కల్పించిన హక్కని ఫోరం కార్యదర్శి కె.వి.కృష్ణయ్య పేర్కొన్నారు. విభజనపై తమ అభిప్రాయాలు చెప్పే భావప్రకటన స్వేచ్ఛను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజా ఉద్యమమని, లక్షలాది మంది స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మద్దతుగా ఉద్యోగులు కూడా ఆందోళన చేపట్టవచ్చన్నారు. డిమాండ్లు సాధించేవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.