
బాబు నైజమేంటో తెలుస్తోంది: ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అన్నాహజారే వంటివారు ఆందోళనలు చేస్తుండడంతోపాటు మరోవైపు దీనిపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు ఆ చట్టాన్ని రైతులపై ప్రయోగిస్తానని చెప్పడాన్నిబట్టే ఆయన వైఖరేంటో తెలిసిపోతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం సైతం భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో రాజధాని గ్రామాల రైతులపై ఈ చట్టం ప్రయోగించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ ఆర్డినెన్స్‌పై పార్లమెంటులో స్పష్టత వచ్చేవరకైనా దీనిని ఆపివేయాలన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితులు ఏర్పడితే.. తమ పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు. అవసరమైతే తమపార్టీ రైతులపక్షాన కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు.
ల్యాండ్‌పూలింగ్ విధానంలో ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన భూమి, అక్కడనున్న ప్రభుత్వ భూములన్నీ కలపి దాదాపు 40 వేల ఎకరాల వరకు అవుతున్నాయని, అలాంటప్పుడు అదనంగా రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాల్సిన అవసరమేంటని ఆర్కే ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఆ 40 వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మాణం చేపట్టాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ రైతులపక్షాన ఉండి పోరాడబట్టే ప్రభుత్వం భూసమీకరణ గడువు ముగిసే సమయంలో అదనపు పరిహారాన్ని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. రైతులకు ఒక సెంటు పరిహారం కూడా అదనంగా పెంచేది లేదని మంత్రి నారాయణ ఫిబ్రవరి మొదటివారంలో చెప్పారని, ఇప్పుడు సీఎం ప్రకటన చేశారంటే అందుకు తమ పార్టీ ఒత్తిడే కారణమన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం 30 వేలమంది వరకు ఉన్న రైతులకు పరిహారం పెంచింది కానీ... 3 లక్షలమంది కౌలురైతులు, కూలీలకు పరిహారం పెంచలేదని ఆర్కే తప్పుపట్టారు.
రాజధాని ఒప్పందం ఎవరితో?
రాజధాని నిర్మాణంకోసం సింగపూర్‌తో ఒప్పందం విషయంలో ఆ దేశ మంత్రి మాటలు, మన సీఎం మాటలు భిన్నంగా ఉంటున్నాయని రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది తమ దేశానికి చెందిన సంస్థలతోనేనని సింగపూర్ మంత్రి చెబుతుంటే, చంద్రబాబు ఇన్నాళ్లూ సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్నట్టు చెబుతూ వచ్చారన్నారు.ఈ విషయంలోనూ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టించిందన్నారు.