విశాఖ : స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను రాష్ట్ర ఉత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. నేడు అల్లూరి 117వ జయంతి సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లా పాండురంగిలో శుక్రవారం ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లూరి సేవలను స్మరించుకున్నారు.
సీతారామరాజును పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్, మలబారు స్పెషల్ పోలీసులు, బళ్లారి, కోరమండల్, ఈస్ట్కోస్ట్ రైఫిల్స్, కోరాపుట్ రిజర్వు పోలీసులను రంగంలోకి దింపింది. ఎప్పటికప్పుడు అల్లూరి చాకచక్యంగా తప్పించుకుని ఉద్యమాన్ని కొనసాగించారు.
1924 మే 7న సీతారామరాజును బ్రిటీష్ సైన్యం చుట్టుముట్టి తుపాకులతో కాల్చి చంపారు. భౌతికంగా ఆయన మనమధ్య లేకున్నా ప్రజల గుండెల్లో నేటికీ విప్లవ వీరుడుగానే నిలిచిపోయారు. కాగా అల్లూరి సీతారామరాజు వర్థంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.