రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు అమ్మేస్తారా? | Ammestara state contractors? | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు అమ్మేస్తారా?

Published Sat, Mar 21 2015 2:17 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు అమ్మేస్తారా? - Sakshi

రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు అమ్మేస్తారా?

కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమిషన్లు దండుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం దారుణమైన జీవో 22ను జారీ చేసిందని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కాంట్రాక్టులోని లేబర్, మెషినరీ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, కంట్రోల్ బ్లాస్టింగ్.. తదితర అంశాల్లో ధరల పెంపునకు ఈపీసీ విధానం అనుమతించకపోయినా.. చంద్రబాబు ప్రభుత్వం వాటి ధరల పెంపునకు అవకాశం కల్పిస్తూ జీవో 22 జారీ చేసిందని తప్పుపట్టారు. గతంతో గవర్నర్ పక్కన (అబయన్స్‌లో) పెట్టిన జీవో 13పై.. అబయన్స్‌ను తొలగించి మరీ.. అంతకంటే దారుణమైన జీవో 22ను తీసుకురావడం చంద్రబాబుకే చెల్లిందని నిప్పులు చెరిగారు.

‘‘ప్రభుత్వం ఇటీవల జీవో 22ను జారీ చేసింది. రాష్ట్రాన్ని అమ్మేసే జీవో అది. కిరణ్ సర్కారు.. అది చంద్రబాబునాయుడు రక్షించిన సర్కారు.. అందుకే దాన్ని ‘తెలుగు కాంగ్రెస్’ సర్కారు అనాలి. కిరణ్ సర్కారు ఎన్నికలకు ముందు ఎస్కలేషన్ కింద కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు 2014 ఫిబ్రవరి 7న జీవో 13ను జారీచేసింది. ఈ జీవోను అప్పట్లో కొందరు కిరణ్ మంత్రులే వ్యతిరేకించడంతో.. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ జీవోను పక్కన పెట్టారు. ఈలోగా రాష్ట్రపతి పాలన రావడంతో గవర్నర్ ఆ జీవోను అబయన్స్‌లో పెట్టారు.

గవర్నర్ అబయన్స్‌లో పెట్టిన ఆ జీవోను చంద్రబాబు ప్రభుత్వం.. అబయన్స్ విత్ డ్రా చేసుకుని మరీ 2015 మార్చి 22న జీవో 22ను జారీచేసింది. ఓ వైపు రాష్ట్రం దివాలాలో ఉందని చంద్రబాబు అంటారు. మరోవైపు గవర్నర్ అబయన్స్‌లో పెట్టిన జీవోను విత్ డ్రా చేసుకుని.. లేబర్, మెషినరీ, ఇతర ధరల తేడా (ప్రైస్ వేరియేషన్) మేరకు కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్ కింద అదనంగా బిల్లులు చెల్లించేందుకు ఆమోదం తెలుపుతూ జీవో 22ను జారీచేశారు. ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్.. మొత్తం కాంట్రాక్టర్‌దే బాధ్యత. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సాగునీటి ప్రాజెక్టులను చేపట్టిన సందర్భంలో ఈపీసీ విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టరే డిజైన్లు దగ్గర నుంచి పనులు పూర్తిచేసే వరకూ అన్ని తానే చూసుకోవాలి. ప్రభుత్వ అధికారులు పనులను సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షిస్తారు. సిమెంటు, స్టీలు, పెట్రోలు, డీజిల్ ధరలు ఐదు శాతం కన్నా ఎక్కువ పెరిగితే ఎస్కలేషన్ నిబంధన కింద అదనంగా చెల్లింపులు అడగవచ్చని ఈపీసీ విధానంలో స్పష్టంగా ఉంది. కానీ.. లేబర్, మెషినరీ, ఇతరాలు (60 శాతం పనులు)కు ఎస్కలేషన్ నిబంధన వర్తింపజేయాలన్నది ఈపీసీలో లేదు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం పనుల్లో 60 శాతం ఉండే లేబర్, మెషినరీ, ఇతరాలకు ఎస్కలేషన్ నిబంధనను వర్తింపజేస్తూ జీవో 22 జారీ చేయడమంటే రాష్ట్రాన్ని అమ్మేయడమే.
 
అంతేకాదు.. డిస్ట్రిబ్యూటరీ పనుల్లోనూ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించింది. ఈపీసీలో తొలుత టెండర్లు పిలిచిన ప్రకారం ఎకరానికి నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేస్తే కాంట్రాక్టర్‌కు రూ. 4,700 ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ పనులు చేస్తే ఎకరానికి రూ. 10,500 ఇస్తామని ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ కాంట్రాక్టర్ డిస్ట్రిబ్యూటరీ పనులు చేయలేమని చెబితే.. వాటిని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలుస్తారు.

2015-16 ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం కొత్త ధరలు నిర్ణయిస్తారు. ఐదు సంవత్సరాలకు ఏటా కనీసం 6 శాతం ద్రవ్యోల్బణం ఉందని లెక్కగట్టి.. ఎకరాకు డిస్ట్రిబ్యూటరీలు తవ్వడానికి.. రూ. 13,650 ధరను ఐబీఎం (ఇంటర్నరల్ బెంచ్ మార్క్)గా నిర్ణయిస్తారు. ఎక్కడ రూ. 4,700? ఎక్కడ రూ. 13,650? అంటే.. అప్పటికీ ఇప్పటికీ 190 శాతం తేడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అవసరమైన ప్రాంతాల్లో అదనపు నిర్మాణాలు చేపడితే.. అదనంగా చెల్లించాలన్న నిబంధన ఈపీసీలో ఎక్కడా లేదు.
 
కానీ.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అదనపు నిర్మాణాలకు అదనపు బిల్లులు చెల్లిస్తామని జీవో 22లో పేర్కొంది. ఈపీసీ నిబంధనలను చూపించయినా, గవర్నర్ అబయన్స్‌లో పెట్టిన విషయాన్ని అయినా చూపించి ప్రభుత్వం తప్పించుకునే వెసులుబాటు ఉన్నా.. కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసం రాష్ట్రాన్ని అమ్మేసేందుకు సిద్ధపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement