దేకనకొండ (కురిచేడు) :అమరావతి–అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించడం లేదు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని, ఇందుకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. గ్రామంలో శనివారం జరుగుతున్న సర్వేను అడ్డుకున్నారు. సుమారు 150 మంది రైతులు, మహిళలు, పిల్లలు, పొలాల్లో ఎండలో బైఠాయించారు.
తమ భూములకు నాలుగు ఎకరాల తూర్పు వైపున ప్రభుత్వ పశుమేత పోరంబోకు భూములున్నా అవి తీసుకోకుండా పట్టా భూములు లాక్కుని ప్రభుత్వం తమను రోడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్రామానికి చెందిన సుమారు 40 మంది రైతుల భూమి 200 ఎకరాలను నడికుడి –శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణానికి లాక్కున్నారని, రోడ్డు నిర్మాణానికి మరో 350 ఎకరాలు 70 మంది రైతుల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని ఆవేదన వ్యక్తంచేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకపోవటంతో కందుకూరు ఆర్డీఓ మల్లికార్జునకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఆయన కూడా సర్వే అనంతరం గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకుని భూములు సేకరిస్తామని చెప్పారు. దీనికి సంతృప్తి చెందని రైతులు తమ భూములకు ఎకరాకు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం రూ.15 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, పూర్తిగా భూములు కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వ భూమి కొంత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సర్వేయర్ దర్బారు మస్తాన్, వీఆర్వోలు కేవీ నాగరాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
హామీ ఇచ్చే వరకూ సర్వే జరగనివ్వం..
Published Sun, Jun 4 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM
Advertisement