Greenfield Express Highway
-
ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..
ప్రస్తుతం.. : కర్ణాటక రాజధాని బెంగళూరు – విజయవాడ మధ్య రోడ్డు మార్గం దూరం 560 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు 12 గంటలు. అదీ నేరుగా లేదు. వ్యయప్రయాసలతో కూడుకొన్నది. విజయవాడ నుంచి రాయలసీమకు వెళ్లడానికీ సరైన దారి లేదు. మూడేళ్ల తర్వాత : బెంగళూరు నుంచి విజయవాడకు రోడ్డు మార్గం దూరం 342 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 6 గంటలే. పైగా, విజయవాడ నుంచి రాయలసీమలోని అనేక ప్రాంతాలకు సౌకర్యవంతమైన రోడ్డు మార్గం. ప్రయాణ సమయం, ఖర్చు కూడా తక్కువ. సాక్షి, అమరావతి: భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బెంగళూరు – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేతో ఈ కల సాకారమవుతుంది. రూ.19,200 కోట్లతో ఆరు లేన్లుగా 342 కిలోమీటర్ల ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ హైవేకి భూసేకరణ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా పూర్తి చేసింది. దాంతో 10 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి, పనులు అప్పగించే చర్యలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) వేగవంతం చేసింది. నాలుగు ప్యాకేజీలకు టెండర్లు పిలిచింది. 2025 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతానికి విజయవాడతో నేరుగా రహదారి లేదు. కర్ణాటకకు కూడా అనుసంధానం సరిగా లేదు. ఈ రెండు ప్రయోజనాలను సాధించాలన్న ద్విముఖ వ్యూహంతో రాష్ట్రంలో మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ హైవేగా బెంగళూరు – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. సీఎం జగన్ సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారు. ప్రస్తుతం బెంగళూరు – విజయవాడ మధ్య దూరభారాన్ని దాదాపు సగానికి తగ్గించేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఆరు గంటల్లోనే బెంగళూరు చేరుకోవచ్చు. సరుకు రవాణా కూడా మరింతగా పెరుగుతుంది. ఇదీ రూట్.. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు నుంచి ఈ హైవే ప్రారంభమవుతుంది. మన రాష్ట్రంలో పుట్టపర్తి జిల్లాలోని కందికొండ, వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, నెల్లూరు జిల్లా మల్లెపల్లి, వంగపాడు, ప్రకాశం జిల్లా అద్దంకి మీదుగా మేదరమెట్ల వరకు వస్తుంది. అక్కడ జాతీయ రహదారి–16కు అనుసంధానిస్తారు. ఇది నేరుగా విజయవాడను కలుపుతుంది. -
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. ఆ రైతులకు ఎకరానికి రూ.9.20లక్షలు
సాక్షి, వైఎస్సార్ కడప(చాపాడు): గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.9.20లక్షల నష్టపరిహారాన్ని కేంద్రం ఇవ్వనున్నట్లు తహసీల్దారు సుభాని తెలిపారు. మండలంలోని సిద్దారెడ్డిపల్లె పంచాయతీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పిచ్చపాడు రెవెన్యూ పొలాల పరిధిలోని రైతులతో తహసీల్దారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం భూములు సేకరిస్తోందన్నారు. భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.9.20లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు నిర్ణయించిందన్నారు. రైతులకు అభ్యంతరాలుంటే రాత పూర్వకంగా తెలియజేయాలన్నారు. రైతులు భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం రెవెన్యూ సిబ్బందికి అందించాలన్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ ప్రవీణ్, వీఆర్ఓ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి మరో ఎక్స్‌ప్రెస్ హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రానుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా చెన్నై–సూరత్ కారిడార్‌కు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఇటీవల ఆమోదం తెలిపింది. దేశంలో తూర్పు, పశ్చిమ పోర్టులను అనుసంధానించే ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో 320 కి.మీ. ఏపీలో నిర్మించనున్నారు. మొత్తం రూ. 50 వేల కోట్ల అంచనాతో ఆమోదించిన ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాచబాట పడనుంది. మరోవైపు చెన్నై–విశాఖపట్నం, ముంబై–ఢిల్లీ కారిడార్లతో కూడా దీనిని అనుసంధానించాలని ప్రణాళిక రూపొందించడం రాష్ట్రానికి మరింత ఉపయుక్తంగా మారనుంది. తూర్పు, పశ్చిమాలను అనుసంధానిస్తూ.. దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య సరుకు రవాణాలో వ్యయ, ప్రయాసలను తగ్గించేందుకు చెన్నై–సూరత్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం చెన్నై నుంచి సూరత్‌కు నెల్లూరు, హైదరాబాద్, షోలాపూర్, పుణెల మీదుగా వెళ్లాల్సి ఉంది. అలాగే రాయలసీమ నుంచి చిత్రదుర్గ, దావణగెరె, బెల్గాం, కొల్హాపూర్, పుణెల మీదుగా ప్రయాణించాల్సి ఉంది. ఈ రెండు మార్గాలు ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినవి. కొత్త ప్రాజెక్టుతో చెన్నై నుంచి మన రాష్ట్రంలోని తిరుపతి, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్ణాటకలో కోస్గి, రాయచూర్, మహారాష్ట్రలోని షోలాపూర్, నాసిక్ మీదుగా గుజరాత్‌లోని సూరత్ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కానుంది. దాంతో దక్షిణాది నుంచి సూరత్‌కు 350 కి.మీ. దూరం తగ్గడంతోపాటు 6 గంటల ప్రయాణ సమయం కలసి వస్తుంది. ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో తమిళనాడులో 156 కి.మీ., ఏపీలో 320 కి.మీ., తెలంగాణలో 65 కి.మీ., కర్ణాటకలో 176 కి.మీ, మహారాష్ట్రలో 483 కి.మీ., మిగిలినది గుజరాత్లో నిర్మించనున్నారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించడం కోసం ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. డీపీఆర్ ఖరారయ్యాక ప్రాజెక్టును చేపట్టి రెండేళ్లలో పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఊతం.. చెన్నై–సూరత్ కారిడార్ మన రాష్ట్రంలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు, కడప, కర్నూలు, దొనకొండ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఆ ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది. చెన్నై–సూరత్ కారిడార్ నిర్మాణం పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. పశ్చిమాసియా దేశాల నుంచి భారత్‌కు సూరత్ పోర్ట్ ముఖద్వారంగా ఉంది. కాబట్టి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పారిశ్రామిక ఉత్పత్తులను పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ కారిడార్ ద్వారా నేరుగా సూరత్ పోర్టుకు తరలించవచ్చు. ఇక దేశంలో వస్త్ర పరిశ్రమకు సూరత్ కేంద్రంగా ఉంది. మన రాష్ట్రంలో నగరి, వెంకటగిరి, ధర్మవరం, చీరాల, మంగళగిరి ప్రాంతాల్లోని చేనేత ఉత్పత్తులను సూరత్ మార్కెట్‌కు తరలించేందుకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. మన రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్టుతోపాటు కొత్తగా నిర్మించనున్న బందరు, రామాయపట్నం పోర్టులను సూరత్ పోర్టుతో అనుసంధానానికి సాధ్యపడుతుంది. ఇక చెన్నై–సూరత్ కారిడార్ దిగువన చెన్నై– విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌తోనూ ఎగువన ముంబై–ఢిల్లీ కారిడార్‌తోను అనుసంధానించనున్నారు. తద్వారా అతి పెద్ద పారిశ్రామిక కారిడార్ రూపొందనుంది. దీంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. -
మూడు రాష్ట్రాలకు మణిహారం
సాక్షి, అమరావతి: మూడు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి మణిహారం లాంటి విశాఖపట్నం–రాయ్‌పూర్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. తూర్పు తీరం నుంచి అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర స్థాయి కార్గో రవాణాకు విశాఖ ప్రధాన కేంద్రం కానుంది. విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌ను అనుసంధానిస్తూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాన్ని చేపట్టనున్నారు. భారత్‌మాల ప్రాజెక్టు మొదటి దశ కింద మొత్తం 464 కి.మీ. మేర ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సన్నాహాలు వేగవంతం చేసింది. రాష్ట్రంలో రూ.3,200 కోట్లతో 100 కి.మీ. కార్గో రవాణాకు కీలకమైన రాయ్‌పూర్ – విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌కు ఎన్హెచ్ఏఐ ప్రణాళిక రూపొందించింది. దాదాపు రూ.20 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును ఆమోదించింది. రాయ్‌పూర్ నుంచి ఒడిశా మీదుగా విశాఖలోని సబ్బవరం వరకు 464 కి.మీ. మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో 124 కి.మీ, ఒడిశాలో 240 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 100 కి.మీ. మేర నిర్మాణం చేపడతారు. అత్యంత కీలకమైన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కోసం ఒడిశాలో అటవీ భూముల సేకరణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కూడా జారీ చేసింది. మూడు ప్యాకేజీల కింద ఈ రహదారి పనులను చేపట్టాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించేందుకు టెండర్లు పిలిచి కన్సల్టెన్సీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో విజయనగరం జిల్లా సాలూరు నుంచి విశాఖ జిల్లా సబ్బవరం వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. ఏపీలో ఆరు లేన్ల రహదారికి రూ.3,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక ఖరారైంది. దాదాపు 2 వేల ఎకరాలను సేకరించాలని అంచనా వేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో దాదాపు 1,300 ఎకరాలను సేకరించాల్సి ఉంది. కీలకమైన ఈ ప్రాజెక్టు భూసేకరణకు విజయనగరం, విశాఖ జిల్లా యంత్రాంగాలు సన్నాహాలు వేగవంతం చేశాయి. పారిశ్రామికాభివృద్ధికి చుక్కాని.. రాయ్‌పూర్– విశాఖ ఎకనామిక్ కారిడార్ పారిశ్రామికాభివృద్ధికి చుక్కానిలా నిలవనుంది. కార్గో రవాణాకు కీలకంగా మారనుంది. విశాఖపట్నం, గంగవరం పోర్టుల నుంచి రాష్ట్రంతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు కార్గో రవాణాకు ఈ రహదారే రాచబాట కానుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్, భిలాయి స్టీల్‌ప్లాంట్ (ఛత్తీస్‌గఢ్), బైలదిల్లాలోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఛత్తీస్‌గఢ్), దామంజోడిలోని నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్(ఒడిశా), సునాబెడలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(ఒడిశా) లాంటి కీలక పారిశ్రామిక కేంద్రాలను ఈ రహదారి అనుసంధానించనుంది. కార్గో రవాణా, పారిశ్రామిక అనుబంధ పరిశ్రమల వృద్ధి ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంత కీలకమైన ప్రాజెక్టు కావడంతో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ రహదారి గురించి కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. 2024 నాటికి రాయ్‌పూర్ – విశాఖ ఎకనామిక్ కారిడార్‌ను పూర్తి చేస్తామని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆయనకు తెలియజేశారు. ఈ రహదారి నిర్మాణ పనులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. -
హామీ ఇచ్చే వరకూ సర్వే జరగనివ్వం..
దేకనకొండ (కురిచేడు) :అమరావతి–అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించడం లేదు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని, ఇందుకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. గ్రామంలో శనివారం జరుగుతున్న సర్వేను అడ్డుకున్నారు. సుమారు 150 మంది రైతులు, మహిళలు, పిల్లలు, పొలాల్లో ఎండలో బైఠాయించారు. తమ భూములకు నాలుగు ఎకరాల తూర్పు వైపున ప్రభుత్వ పశుమేత పోరంబోకు భూములున్నా అవి తీసుకోకుండా పట్టా భూములు లాక్కుని ప్రభుత్వం తమను రోడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్రామానికి చెందిన సుమారు 40 మంది రైతుల భూమి 200 ఎకరాలను నడికుడి –శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణానికి లాక్కున్నారని, రోడ్డు నిర్మాణానికి మరో 350 ఎకరాలు 70 మంది రైతుల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని ఆవేదన వ్యక్తంచేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకపోవటంతో కందుకూరు ఆర్డీఓ మల్లికార్జునకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన కూడా సర్వే అనంతరం గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకుని భూములు సేకరిస్తామని చెప్పారు. దీనికి సంతృప్తి చెందని రైతులు తమ భూములకు ఎకరాకు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం రూ.15 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, పూర్తిగా భూములు కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వ భూమి కొంత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సర్వేయర్ దర్బారు మస్తాన్, వీఆర్వోలు కేవీ నాగరాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.