
మాజీ మంత్రి ఆనందగజపతి కన్నుమూత
♦ ఛాతీలో నొప్పి రావడంతో విశాఖ మణిపాల్ ఆసుపత్రికి తరలింపు
♦ చికిత్స పొందుతూ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస
సాక్షి ప్రతినిధి, విజయనగరం, మహారాణిపేట (విశాఖ)/హైదరాబాద్: విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పూసపాటి ఆనంద గజపతిరాజు(66) శనివారం ఉదయం కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయనకు ఛాతీ లో తీవ్ర నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా ఉదయం 8.30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
1983లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆనందగజపతిరాజు ఉమ్మడి ఏపీ మంత్రిగా, రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ఆనందగజపతిరాజు మరణవార్త తెలియగానే సోదరుడు కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు. ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం పార్థీవ దేహాన్ని విజయనగరంలోని ఆయన స్వగృహానికి తరలించారు. ప్రజలు వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించా రు. సాయంత్రం 4.30 గంటల సమయంలో స్వగృహం నుంచి రాజవంశీయుల పూర్వీకుల సమాధులున్న అమరధామం వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. అశోక్ గజపతిరాజు అంత్యక్రియలు నిర్వహించారు. మహారాజ కోటపై ఈశాన్య దిశలో ఉన్న జుల్‌ఫికర్ పతాకాన్ని అవనతం చేశారు.
విశిష్ట వ్యక్తిత్వం..
ఆనందగజపతిరాజుది విశిష్ట వ్యక్తిత్వం. 1950 జూలై17న విజయనగరం మహారాజు పి.వి.జి.రాజు, కుసుమగజపతి ప్రథమ సంతానంగా జన్మించిన ఈయనకు సోదరుడు అశోక్ గజపతిరాజు, సోదరి సునీతాదేవి ఉన్నారు. గ్వాలి యర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం, మద్రాస్ లయోలా కళాశాల, అమెరికా స్టెట్సన్ వర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యా సం చేశారు. హ్యూమనిస్టిక్ స్టడీస్ అంశంలో అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఇంటర్ అమెరికన్ యూనివర్సిటీ 2003లో ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2009లో ఆంధ్రా వర్సిటీ నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్ అందుకున్నారు.
‘రాజకీయ అర్థశాస్త్రంలో దారితప్పిన ఆలోచనలు’అనే పుస్తకాన్ని 2014లో రాశారు. కాగా 1983లో టీడీపీలో చేరడం ద్వారా ఆనంద్‌గజపతిరాజు రాజకీయరంగ ప్రవేశం చేశా రు. భీమిలి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ తొలి కేబినెట్‌లో విద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 1984లో టీడీపీ తరఫున బొబ్బిలి ఎంపీగా విజయం సాధించారు. తర్వా త ఎన్టీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. 1989 ఎన్నికల్లో బొబ్బిలి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 1991 ఎన్నికల్లో గెలుపొందా రు. 1996, 1998 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభకు పోటీ చేసి ఓడారు. విలువలు తగ్గిన రాజకీయాల్లో ఉండలేనంటూ 1998 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రముఖుల సంతాపం
ఆనందగజపతిరాజు మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. విజయనగరంలో మాన్సాస్ విద్యాసంస్థల చైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తగా ఆనందగజపతిరాజు అందించిన సేవలు మరువలేనివన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తన సంతాపాన్ని తెలిపారు. మన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుతోపాటు పలువురు ప్రముఖులు ఆనందగజపతి మృతి పట్ల సంతాపం తెలిపారు.
108 దేవాలయాలకు అనువంశిక ధర్మకర్త
తన తండ్రి పి.వి.జి.రాజు మరణం(1995)తర్వాత విజయనగరం విద్యా సంస్థైన మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్‌గా నియమితులైన ఆనందగజపతి ఇప్పటికీ కొనసాగుతున్నారు. సింహాచలం, రామతీర్థం, అరసవిల్లి, శ్రీకూర్మం, విజయనగరం పైడితల్లమ్మ తదితర 108 దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. 1972లో ఆనందగజపతిరాజుకు ఉమతో వివాహం జరిగింది. వీరికిద్దరు కుమార్తెలు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. 1999లో సుధను ద్వితీయ వివాహం చేసుకున్నారు. వీరికొక కుమార్తె. కొన్నేళ్లుగా విశాఖలో నివాసముంటున్నారు.