అనంతపురం జిల్లాలో పెను విషాదం..
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఎర్రతిమ్మరాజు చెరువు (వైటీ చెరువు)లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది చనిపోయారు. గ్రామానికి చెందిన రామన్న ఇంట్లో శుభకార్యం నిమిత్తం పొరుగు గ్రామానికి చెందిన వారు 20 మంది హాజరయ్యారు. వారంతా ఒక పాత బోటులో సరదాగా చెరువులో ప్రయాణం ప్రారంభించారు. చెరువు మధ్యలో ఉండగా పడవ బోల్తా పడింది. దీంతో పడవలోని 18 మంది మునిగిపోయారు. గజ ఈతగాళ్ల సాయంతో 13 మృతదేహాలను వెలికి తీశారు.
మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాగా ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మిగతా నలుగురి కోసం ఈతగాళ్లు గాలిస్తున్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. అధికారులు, పోలీసు యంత్రాంగం సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులను పూజ, తులసిగా గుర్తించారు. గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన అతిథులు అకాల మృత్యువాత పడటంతో రామన్న కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.
మరోవైపు పడవ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో ఆయన ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలంలోనే వుండి పరిస్థితులను ఎప్పటికప్పుడే తెలియజేయాలని , ఎస్పీని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.