
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు. పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం నిజానిజాలను పరిశీలన చేస్తోందన్నారు. కమిటీ నివేదిక రాగానే అన్ని విషయాలు బయటకు చెబుతామని తెలిపారు. పద్దతి ప్రకారం జరగాలంటే కొంత సమయం పడుతుందని మంత్రి వివరించారు.
నేటి సమావేశంలో భాగంగా మహిళల రక్షణపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి కేసుల విచారణ నెలల తరబడి సాగకుండా మూడు వారాల్లో పూర్తి చేసి నిందితులకు రోజుల వ్యవధిలోనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోబోతోంది. ఈ కేసుల విచారణకు జిల్లాజడ్జితో కూడిన జిల్లాకో ప్రత్యేక కోర్టు, అవసరమైన పక్షంలో ఇంకో కోర్టు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనితో పాటు పలు కీలక బిల్లుపై నేడు సభలో చర్చ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment