తెలుగుతల్లి గుండె పగిలె
సాక్షి, ఏలూరు : ప్రజా ఉద్యమాలు.. అలుపెరగని పోరాటాలు.. నిరాహార దీక్షలు.. అన్నీ నిష్ర్పయోజనం అయ్యాయి. తెలుగు నేలను ముక్కలు చేసేశారు. ప్రాంతాలు వేరైనా, వేష భాషల్లో తేడాలున్నా దశాబ్దాలుగా తెలుగువారంతా ఒకే రాష్ట్రంలో కలిసి ఉన్నారు. కానీ తెలుగుజాతి నేటి నుంచి రెండుగా విడిపోతోంది. నిన్నటి వరకు నాది అనుకున్న ప్రాంతాలు నేడు పరాయివి అయిపోయాయి. జిల్లా ప్రజల హృదయాల్లో తీరని ఆవేదన నింపింది.
అన్నీ ప్రశ్నలే.. సమాధానాలు లేవు
రాష్ట్రం విడిపోయిందనే బాధలో ఉన్న ప్రజల్లో ఎన్నో భయాలున్నాయి. వాటికి సరైన సమాధానాలిచ్చి, ధైర్యం చెప్పేవారెవరూ కనిపించడం లేదు. 1963లో ప్రారంభమైన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1984లో పూర్తయింది. ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికే 21 ఏళ్లు పడితే హైదరాబాద్ వంటి రాజధానిని నిర్మించడానికి, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, ఎంఎంటీఎస్ రైల్వే వ్యవస్థ, హైటెక్‌సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలు, పరిశ్రమలు, ఫ్లై ఓవర్‌లు నిర్మించడానికి ఎన్నేళ్లు పడుతుంది? సాగు నీరు, తాగు నీటి కోసం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రతో పోరాటాలు చేస్తున్నాం.
బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టులను ఆపలేకపోయాం. తెలంగాణ పాలన పగ్గాలు చేపడుతున్న నేతలు ఇప్పటికే ‘పోలవరం’ప్రాజెక్టుకు కొర్రీలు పెడుతున్నారు. తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని లొల్లి పెడతున్నారు. వారికి సరిపడా పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడివి? నీటి యుద్దాలు, కరెంటు కష్టాలు తీర్చేదెవరు? లోటు బడ్జెట్‌తో ఏర్పడుతున్న అవశేష ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరిగేదెలా?అనే ఆందోళన ఎందరిలోనే కనిపిస్తోంది.
రోదన మిగిలింది
తెలుగుజాతిని ముక్కలు చేయెద్దంటూ జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం వందరోజులకుపైగా సాగింది. ప్రజలే నాయకులై ఉద్యమాన్ని నడిపించారు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, రైతులు, ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు సమైక్యాంధ్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించాయి. ఉద్యమంలో పాల్గొనే ప్రతి పౌరుడు తన జేబులో డబ్బునే ఖర్చు చేశాడు. ఎవరికి వారు చందాలు వేసుకున్నారు. నిరాహార దీక్షలు చేశారు. రోడ్లపైనే వంటావార్పూ నిర్వహించారు. వేర్పాటు వాదుల దిష్టి బొమ్మలను తగులబెట్టారు. విభజనను తట్టుకోలేక ఎందరో గుండె ఆగి చనిపోయారు. అయినా సమైక్య వాదుల గోడును ఎవరూ పట్టించుకోలేదు. ఉద్యమాన్ని ఖాతరు చేయలేదు. నేటితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తోంది. తెలుగుజాతి రెండుగా చీలిపోతోంది.