సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరిన్ని మైనింగ్ లీజులను ప్రభుత్వం రద్దు చేసింది. సోమవారం 32 లీజులను రద్దు చేసిన ప్రభుత్వం.. దానికి కొనసాగింపుగా మంగళవారం మరో 44 లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 30కి పైగా లీజులను రద్దు చేసింది. నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాలంలో ఖనిజం తవ్వకాలు జరపలేదని, వార్షిక, నెలసరి రిటర్న్‌లు సమర్పించలేదని, గని ప్రదేశంలో తూనిక యంత్రం ఏర్పాటు చేయలేదని తదితర కారణాలు చూపుతూ ఖనిజ రాయితీల చట్టం (1960)లోని సెక్షన్ 28(1) కింద లీజులు రద్దు చేసినట్లు భూగర్భ గనుల శాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
గడువు తీరిపోవడం, షోకాజ్ నోటీసులకు ఇచ్చిన సమాధానాలు సహేతుకంగా లేకపోవడం, రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం కూడా లీజుల రద్దుకు కారణాలని తెలిపింది.