సీఎం వైఎస్ జగన్ సమక్షంలో చేసుకున్న ఒప్పంద పత్రాలతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ సీఎండీ మధుసూదన్, ఎన్‌ఎండీసీ ప్రతినిధి అలోక్‌కుమార్. చిత్రంలో సీఎస్ నీలం సాహ్ని, ఏపీఐఐసీ చైర్మన్ రోజా తదితరులు
సాక్షి, అమరావతి: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటులో మరో కీలక అడుగు పడింది. ముడి ఇనుము సరఫరా విషయంలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ సీఎండీ పి.మధుసూదన్, ఎన్‌ఎండీసీ ప్రతినిధి అలోక్ కుమార్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇది చరిత్రాత్మక ఒప్పందమని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అభివర్ణించారు.
ఈ ఒప్పందం ప్రకారం ఎన్‌ఎండీసీ ఏటా 5 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయనుంది. ఉక్కు ఉత్పత్తి ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా తొలివిడతలో కర్మాగారానికి సమీపంలో ఉన్న గనుల నుంచే ముడి ఇనుము సరఫరా చేయనున్నట్లు ఎన్‌ఎండీసీ అధికారులు తెలిపారు. కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్.. ఉక్కు కర్మాగారానికి ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఈ నెల చివరి వారంలో సీఎం శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్‌కు 3,295 ఎకరాలను కేటాయించారు. నిర్మాణాన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని, మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభిస్తుందని సీఎం గతంలో ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా, అధికారులు పాల్గొన్నారు.
8,000 మందికి ఉపాధి
ఎన్‌ఎండీసీతో ఒప్పందం కుదరడంపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 8,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించనుందని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment