కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలి. పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలి. తొలుత ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలి ఉంటే నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలి. కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్ ప్లాంట్‌ను తీసుకొస్తున్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలి.
– సీఎం జగన్
సాక్షి, అమరావతి: కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నిర్మాణ కంపెనీ ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేయాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామని చెప్పారు. ఇందుకు కనీసం 7 వారాల సమయం పడుతుందని, ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3–4 వారాల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
రూ.300 కోట్ల పెట్టుబడులతో ఉద్యోగాలు
► కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు సీఎంకు వివరించారు.
► రూ.300 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందన్నారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
► పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని, తద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం కావాలని సీఎం సూచించారు.
► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment