కరకవలసలో గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాక్సిన్‌లు వేస్తున్న వైద్యసిబ్బంది
జలుమూరు శ్రీకాకుళం : జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. జలు మూరు మండలం కరకవలస గ్రామంలో ఇటీవల వింతవ్యాధితో 12 గొర్రెలు, రెండు గేదెలు చనిపోయాయి. దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి నిర్ధారణ కోసం జీవాల రక్త నమూనాలను విజయవాడలోని పరీక్ష కేంద్రానికి తరలించారు.
క్షుణ్ణంగా పరీక్షలు జరపగా ఆంత్రాక్స్ వ్యాధిగా నిర్ధారణ జరిగిందని జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయానికి నివేదిక వచ్చిందని టెక్కలి డివిజన్ డీడి మంచు కరుణాకరరావు మంగళవారం తెలిపారు. కరకవలసలో ఆంత్రాక్స్?.. ఇంకా నిర్ధారించని పశుసంవర్ధక శాఖ శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం వచ్చిన కథనానికి ఆయన స్పందించారు.
ప్రస్తుతం కరకవలస, అనుపురం, మర్రివలస, బైదలాపురం, కిట్టలపాడు, అక్కరాపల్లి తదితర గ్రామాల్లో 3,500 జీవాలకు ‘ఆంత్రాక్స్’ వ్యాక్సిన్‌లు వేసినట్టు డీడీ పేర్కొన్నారు. ఇంకా మూడు కిలోమీటర్ల పరిధిలోని జలుమూరు, సారవకోట, హిరమండలం మండలాల్లో ఉన్న జీవాలకు 13,500 డోస్‌లు వేయాల్సి ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ బెంగళూర్ నుంచి రావాల్సి ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వరులు అప్రమత్తమై.. మందులు తెప్పించారని వివరించారు. జిల్లా వైద్యశాఖ అధికారుల ఆదేశాలతో కరకవలస గ్రామస్తులకు చెందిన కొంతమంది రక్తపూత నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపించామన్నారు.
మాంసం తినకూడదు
కాపర్లు గొర్రెలు, మేకలను అంటిపెట్టుకొని ఉండకూడదని డీడీ స్పష్టం చేశారు. అలాగే వాటి మాంసం తినకూడదన్నారు. జీవాల దగ్గరకు వెళ్లేటపుడు మాస్క్‌లు కచ్చితంగా పెట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల ఇన్‌చార్జి పశువైద్యాధికారి ఉప్పాడ తిరుపతిరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment