Anthrax disease
-
ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త!
సాక్షి, దుగ్గొండి(వరంగల్): గ్రామాలలో గొర్రెలు చనిపోతే వాటిని మాంసం కోసం విక్రయించడం చేయవద్దని వాటిని గొయ్యి తీసి పాతిపెట్టాలని అధికారులు తెలిపారు. చనిపోయిన గొర్రెల శరీరాన్ని ఓపెన్ చేసి మాంసాన్ని విక్రయించడం వల్ల బ్యాక్టీరియా మనుషులకు చేరి అనారోగ్యం పాలవుతారని తెలిపారు. వరంగల్ జిల్లా చాపలబండా గ్రామంలోని గొర్రెల మందలో ఆంత్రాక్స్ వ్యాధితో నాలుగు గొర్రెలు మృత్యువాతపడిన విషయం విధితమే. వరంగల్ చాపలబండలో ఆంత్రాక్స్ వ్యాధితో నాలుగు గొర్రెలు చనిపోయిన నేపథ్యంలో మాసం కొనేముందు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంత్రాక్స్ వ్యాధి సోకిన మేకలు, గొర్రెల మాంసాన్ని తాకడం, తినడం, కొనడం చేయవద్దన్నారు. చదవండి: లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్! మేక/గొర్రెను కోసినప్పుడు వచ్చే రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే ఆంత్రాక్స్ సోకినట్లు గుర్తించాలన్నారు. అలాగే కనీసం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా ఉడికించిన మాంసాన్నే తినాలని సూచించారు. చనిపోయి ఉన్న మూడు గొర్రెలను వెంటనే పాతిపెట్టాలన్నారు. అవి చనిపోయిన ప్రదేశంలో పడిన రక్తంపై ఎండు గడ్డివేసి మంట పెట్టాలని సూచించారు. అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. అధైర్య పడవద్దని ఆంత్రాక్స్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు. అయితే ఆంత్రాక్స్‌తో చనిపోయిన గొర్రెలు ఉన్న మందను ఊరికి దూరంగా ఉంచాలన్నారు. కాపరులు గొర్రెలకు కొంత దూరంగా ఉండి మేపాలన్నారు. చదవండి: డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్.. హెల్మెట్ డాక్టర్స్! అజాగ్రత్తగా ఉంటే మనుషులకు సోకే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. గ్రామంలో మిగిలిన 1200 గొర్రెలకు వెంటనే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని స్థానిక వైద్యాధికారి శారదకు సూచించారు. చాపలబండలో ఐదేళ్ల పాటు ప్రతి 9 నెలలకోసారి గొర్రెలు, మేకలకు ఆంత్రాక్స్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. గొర్రెలన్నింటిని కొన్ని రోజుల పాటు ఊరికి దూరంగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
పెంపుడు జంతువులతో జర జాగ్రత్త..!
సాక్షి, ఖమ్మం: పిచ్చికుక్క కాటుకు రేబిస్ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాను జూలై 6న కనుగొన్నారు. ఆ రోజును ప్రపంచ వ్యాప్తంగా ‘జూనోసిస్ డే’ను జరుపుకుంటారు. పశువులు, జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమించే వ్యాధులను జోనోటిక్’ వ్యాధులు అంటారు. ఈ వ్యా«ధులు ప్రమాదకరమైనవి. మరణాలు కూడా సంభవిస్తాయి. 1885 జూలై 6న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్) నివారణకు రేబిస్ టీకాలను కుక్క కాటుకు గురైన జోసెఫ్ మీస్టర్ అనే బాలుడిపై ప్రయోగించి విజయం సాధించారు. అప్పటి నుంచి పెంపుడు జంతువులకు రాబిస్ వ్యాధి సోకకుండా యాంటీరాబిస్ టీకాను ఇస్తారు. జోనోటిక్ వ్యాధి కారణంగా మరో 200 వ్యాధులు సంక్రమిస్తాయి. మానవుడు పాలు, మాంసం, కోసం పెంపుడు జంతువులను, కోళ్లను పెంచుతుంటారు. మానసిక ఉల్లాసం కోసం కుక్కలను పెంచుతున్నారు. పెంపుడు జంతువులు, కోళ్ల పెంపకం వలన కూడా మానవుడు అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. ప్రపంచంలో ప్రతి ఏటా దాదాపు 20 వేల మందికి పైగా రేబిస్ వ్యాధి వలన మరణిస్తున్నారు. 3 మిలియన్ల మంది పిచ్చికుక్కల కాటున పడి రేబిస్ వ్యాధి టీకాలు చేయించుకుంటున్నారు. 1995లో ప్రపంచంలో రేబిస్ వ్యాధి కారణంగా దాదాపు 70 వేల మంది మరణించారు. వీరిలో 35 వేల మంది భారతీయలు ఉన్నారు. పొలం పనులు చేసే రైతులు, తోళ్ల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వ్యాధులు సోకి చనిపోయిన జంతువుల మాంసాన్ని తినేవాళ్లు, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా మెలిగే వారు జోనోటిక్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జోనోటిక్ వ్యాధుల రకాలు, వాటి నివారణపై ఖమ్మం పశువ్యాధి నిర్దారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు డాక్టర్ అరుణ వివరించారు. జోనోటిక్ వ్యాధి 7 రకాలు ► బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ లెప్టోస్పైరోసిస్, క్షయ ► వైరస్: రేబిస్, బర్డ్‌ఫ్లూ, మెదడు వాపు, సార్స్, మేడ్‌కౌడిసీజ్ ► ప్రొటోజోవా: టాక్సోప్లాస్మోడియా, లీష్మెనీయాసిస్ ► రెకెట్చియా: టిక్, టైఫస్, క్యూఫీవర్ ► హెల్నింథ్స్: ఎకైనోకోకోసిస్, టీనియాసిస్ ► ఎక్టోపారసైట్స్: స్కేజిస్ పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్): పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే అతి భయంకరమైన వ్యాధి రేబిస్. పిచ్చికుక్కల లాలాజలంలో వ్యాధికారకం ‘రేబిస్’ వైరస్ ఉంటుంది. మనుషుల శరీరంపై ఉన్న పుండును నాకినా లాలాజలం ద్వారా వ్యాధి సోకుతుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల లోపుగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ♦ మనుషుల్లో ఈ వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు. ♦ ఈ వ్యాధి సోకిన మనిషి గుటక వేయలేడు. ♦ దాహం వేస్తున్నా నీళ్లు తాగలేరు. నివారణ: కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. డాక్టర్‌ను సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. బర్డ్‌ప్లూ వ్యాధి బర్డ్‌ఫ్లూ లేదా ఇన్‌ప్లూయాంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్ వలన కలిగే వ్యాధి. ఈ వైరస్‌లో 144 ఉపరకాలున్నాయి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవాళికి సంభవిస్తుంది. 1997లో ఖండాతర వ్యాధిగా రూపొంది చాలా దేశాల్లో కోట్లాది కోళ్లు మరణించాయి. ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్ల కలకలతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. మెదడు వాపు ఇది వైరస్ వలన కలిగే వ్యాధి. వ్యాధి కారక వైరస్ క్రిములు పందుల నుంచి దోమకాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఇళ్ల దగ్గర పందుల సంచారం లేకుండా చూసుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టి ఈ వ్యాధిని అరికట్టుకోవాలి. ఆంత్రాక్స్ దోమ వ్యాధి ఈ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది. బ్రూసెల్లోసిస్ ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్ బూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి అన్ని జాతుల పశువులకు, మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వచ్చి ఈసుకుపోతాయి. మగ పశువుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వితంగా వ్యందత్వం ఏర్పడుతుంది. జోనోటిక్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ⇒∙జోనోటిక్ వ్యాధులన్నీ పశువులకు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ⇒ వీధి కుక్కలకు యాంటీరేబిస్ టీకాలు వేయించి లైసెన్సులు ఇవ్వాలి. ⇒ పెంపుడు జంతువులతో, కోళ్లతో సన్నిహింతగా మెలిగే వాళ్లు జోనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. -
ఆంత్రాక్స్ కలవరం
చిత్తూరు, తిరుపతి (అలిపిరి)/కార్వేటినగరం: కార్వేటినగరం మండలం కోదండరామపురం దళితవాడలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టించింది. ఏడుగురికి బొబ్బలు ఏర్పడడంతో ఇక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల గ్రామంలో 25 పాడి పశువులు, గొర్రెలు, మేకలు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. మృతి చెందిన పశుమాంసాన్ని తినడంతో వ్యాధి లక్షణాలు బయటపడినట్లు తెలిసింది. బాధితులను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరుగురికి చికిత్స అందజేసి ఇంటికి పంపించారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ రవిరాజు ఒకరికి వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతి రుయాకు తరలిం చారు. ఇతడి రక్తనమూనాలను సేకరించి రుయా పరీక్షల విభాగానికి పంపారు. సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ చినబాబు అత్యవసర విభాగానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి నివేదికలో అది సెరిబ్రల్ మలేరియాగా తేలింది. వదంతలు నమ్మవద్దని సూచించారు. గ్రామంలో వైద్య శిబిరం రెండు దశాబ్దాల క్రితం ఇదే మండలం టీకేఎం పేటలో 85 మందికి ఆంత్రాక్స్ సోకింది. ఆ సమయంలో డాక్టర్ రవిరాజు కార్వేటినగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేశారు. స్థానికుడు కావడంతో తాజాగా కోదండరామాపురంలో వ్యాధి ప్రబలిన విషయం తెలు సుకున్నారు. శుక్రవారం జేడీ వెంకట్రావు, ఎంపీడీఓ వెంకటరత్నమ్మ జిల్లా వైద్యబృందంతో పాటు ఈయన వెళ్లి పరిశీలించారు. ఈ వ్యాధిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పశుమాంసాలు నిల్వ ఉంచిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. గ్రామానికి దూరంగా మాంసాన్ని పూడ్చి వేయాలని అధికారులు ఆదేశించారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. అమరావతి నుంచి కలెక్టరు సమీక్ష.. ఆంత్రాక్స్ వదంతులను ప్రజలు నమ్మవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంత్రాక్స్ అనుమానిత కేసులపై అమరావతి కలెక్టర్ల సదస్సు నుంచి జేసీ గిరీషా, పశుసంవర్థక జేడీ, డీఎంహెచ్‌వో, రుయా సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమీక్షించారు. ఒకరు మాత్రం రుయాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. -
అది ఆంత్రాక్సే!
జలుమూరు శ్రీకాకుళం : జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. జలు మూరు మండలం కరకవలస గ్రామంలో ఇటీవల వింతవ్యాధితో 12 గొర్రెలు, రెండు గేదెలు చనిపోయాయి. దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి నిర్ధారణ కోసం జీవాల రక్త నమూనాలను విజయవాడలోని పరీక్ష కేంద్రానికి తరలించారు. క్షుణ్ణంగా పరీక్షలు జరపగా ఆంత్రాక్స్ వ్యాధిగా నిర్ధారణ జరిగిందని జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయానికి నివేదిక వచ్చిందని టెక్కలి డివిజన్ డీడి మంచు కరుణాకరరావు మంగళవారం తెలిపారు. కరకవలసలో ఆంత్రాక్స్?.. ఇంకా నిర్ధారించని పశుసంవర్ధక శాఖ శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. ప్రస్తుతం కరకవలస, అనుపురం, మర్రివలస, బైదలాపురం, కిట్టలపాడు, అక్కరాపల్లి తదితర గ్రామాల్లో 3,500 జీవాలకు ‘ఆంత్రాక్స్’ వ్యాక్సిన్లు వేసినట్టు డీడీ పేర్కొన్నారు. ఇంకా మూడు కిలోమీటర్ల పరిధిలోని జలుమూరు, సారవకోట, హిరమండలం మండలాల్లో ఉన్న జీవాలకు 13,500 డోస్‌లు వేయాల్సి ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ బెంగళూర్ నుంచి రావాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వరులు అప్రమత్తమై.. మందులు తెప్పించారని వివరించారు. జిల్లా వైద్యశాఖ అధికారుల ఆదేశాలతో కరకవలస గ్రామస్తులకు చెందిన కొంతమంది రక్తపూత నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపించామన్నారు. మాంసం తినకూడదు కాపర్లు గొర్రెలు, మేకలను అంటిపెట్టుకొని ఉండకూడదని డీడీ స్పష్టం చేశారు. అలాగే వాటి మాంసం తినకూడదన్నారు. జీవాల దగ్గరకు వెళ్లేటపుడు మాస్క్‌లు కచ్చితంగా పెట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల ఇన్చార్జి పశువైద్యాధికారి ఉప్పాడ తిరుపతిరావు ఉన్నారు. -
ఆంత్రాక్స్‌పై యాక్షన్ ప్లాన్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో మహమ్మారిలా మారిన ఆంత్రాక్స్ నివారణకు ప్రభుత్వం ఐదేళ్ల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ ఏజెన్సీలో ఏటా ఆంత్రాక్స్ కలకలం రేపుతున్న నేపథ్యంలో పశుసంవర్థక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆమోదం తెలుపుతూ నిధుల విడుదలకు ప్రభుత్వం జీవో నంబరు 21ని జారీచేసింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. పాడేరు కేంద్రంగా ఇతర కార్యక్రమాల అమలుకు ఏటా గిరిజన సంక్షేమ శాఖ నుంచి అవసరమైన నిధులు కేటాయిస్తారు. రాష్ట్రంలో ఆంత్రాక్స్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం లేదు. దీంతో వ్యాధి నివారణకు అవసరమయ్యే 3 లక్షల డోస్‌ల ఆంత్రాక్స్ డోస్‌ను సరఫరా చేయాలని పశుసంవర్థకశాఖ జేడీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు మృత పశువుల బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా సరిగా ఖననం చేస్తారు. ఇంకా 500 పశుమిత్రలను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తారు. వీరు ఏజెన్సీ 11 మండలాల్లోని 3700 శివారు గ్రామాలను కవర్ చేస్తారు. వీరికి కిట్లను అందజేస్తారు. ఇందుకు రూ.1.48 కోట్లు, గిరిజనులకు గొర్రెలు, మేకల పెంపకానికి రూ.1.72 కోట్లు కేటాయించారు. వ్యాక్సినేషన్ ఇన్సెంటివ్‌లకు రూ.49 లక్షలు, గిరిజనుల్లో అవగాహనకు రూ.15.40 లక్షలు, ప్రచారానికి రూ.25.50 లక్షలు, పశువుల గుర్తింపునకు రూ.1.25 కోట్లు, పశువుల బీమాకు రూ.19.36 కోట్లు వెరసి రూ.25 కోట్లు మంజూరు చేశారు. దీర్ఘకాలిక ప్రణాళిక కింద గోకులంలు, వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రూ.104 కోట్లు వెచ్చించనున్నారు. -
విజృంభిస్తున్న ఆంత్రాక్స్
డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలో ఆంత్రాక్స్ మళ్లీ విజృంభిస్తోంది. ఐదు రోజుల క్రితం పోతంగి గ్రామంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకగా, తాజాగా ఆ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పంచాయతీ కండ్రుం గ్రామంలో ఇద్దరు గిరిజనులకు సోకింది. కండ్రుం గ్రామానికి చెందిన వంతల సన్యాసి,వంతల అర్జున్ అనే గిరిజనులు ఈవ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. వ్యాధి గ్రస్తులు వారిని అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన మేక మాంసాన్ని వారం రోజుల క్రితం వీరు తిన్నారని, అందువల్లే ఈ వ్యాధి ప్రబలినట్టు గ్రామస్తులు తెలిపారు.' ఇదే గ్రామంలో 2016 ఏప్రిల్‌లో ఆంత్రాక్స్ వ్యాపించింది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ నెలలో ఆంత్రాక్స్ వ్యాధి రావడంపై గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అవగాహన కల్పించాలి ఆంత్రాక్స్ వ్యాధి పట్ల గిరిజనులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవగాహన కల్పించాలని గిరిజన సంఘం నేతలు కోరుతున్నారు. అవగాహన లేకపోవడం వల్ల మృతి చెందిన పశువుల మాంసం తిని వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలుతున్నా నిరోధించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. అప్రమత్తంగా ఉండాలి ఆంత్రాక్స్ పట్ల గిరిజనులు అప్రమతంగా ఉండాలని పాడేరు ఏడీఎంహెచ్‌వో పార్థసారధి సూచించారు. మంగళవారం ఆయన పోతంగి గ్రామాన్ని సందర్శించారు. ఆంత్రాక్స్ వ్యాధి సోకడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన పశువుల మాంసాన్ని తినరాదని తెలిపారు. దీనిపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిం చాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమ వైద్యులు కళ్యాణ్ ప్రసాద్, స్థానికులు శాంతికిరణ్, సింధరాంపడాల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
అనంతపురంలో ఆంత్రాక్స్ కలకలం
అనంతపురం: జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. గోరంట్ల మండలం చెట్లమోరంపల్లికి చెందిన ముగ్గురికి ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయి. ఈ వ్యాధితో వారం వ్యవధిలో 30 గొర్రెలు మృతిచెందాయి. ఆంత్రాక్స్ వల్లే ఈ గొర్రెలు మృతిచెందినట్లు పెనుకొండ పశు వైద్య అధికారి శుభదాస్ ధ్రువీకరించారు. ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గొర్రె మాంసం తినటంతో వారికి కూడా ఆంత్రాక్స్ సోకినట్లు భావిస్తున్నారు. జిల్లా వైద్య అధికారి వెంకట రమణ రోగులను పరామర్శించి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
మళ్లీ ఆంత్రాక్స్ బూచి
- పదకొండేళ్ల క్రితం వెలుగులోకి.. - 2009లో 11 మంది మృత్యువాత - తాజాగా హుకుంపేటలో లక్షణాలు సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో ఆంత్రాక్స్ వ్యాధి వెలుగు చూసి సరిగ్గా పదకొండేళ్లయింది. ఆ తర్వాత ఐదారేళ్ల కోసారి నేనున్నానంటోంది. మన్యం వాసులను తరచూ భయకంపితులను చేస్తోంది. తాజాగా హుకుంపేట మండలంలో మూడు గ్రామాల్లో ఐదుగురు గిరిజనులకు ఆంత్రాక్స్ లక్షణాలు వెలుగు చూడడం ఇటు మన్యం ప్రజలను, అటు అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. 2004 సెప్టెంబర్‌లో అరకులోయ మండలం పెదలబుడులో తొలిసారిగా ఆంత్రాక్స్ కేసు బయట పడింది. ఆ మరుసటి సంవత్సరం జూన్ 18న అదే మండలం భీముడివలసలో ఆరుగురు (నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు) గిరిజనులకు ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు. అప్పట్లో వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించి వైద్య చికిత్స అందించడంతో కోలుకున్నారు. పది రోజులు నిల్వ ఉంచిన మేక మాంసాన్ని తినడం వల్ల ఆంత్రాక్స్ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ 2009 మే నెలలో ముంచంగిపుట్టు మండలం కర్లపొదూరు, అత్తికల్లు, ఆదర్లడి, ముచ్చిపుట్టు, పిల్లగండువ , లక్ష్మీపురం, బరడ తదితర గ్రామాల్లో పలువురు గిరిజనుల్లో ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. అప్పట్లో సుమారు 60 మంది రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో 11 మందికి ఆంత్రాక్స్ లక్షణాలున్నట్టు తేలింది. మన్యంలో ఆంత్రాక్స్ అలజడిపై ఢిల్లీ నుంచి వైద్య నిపుణుల బృందం కూడా వచ్చి ఆయా ప్రాంతాల్లో పరిశీలించి వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత ఆంత్రాక్స్ లక్షణాలతో ఆయా గ్రామాల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఆ మరణాలు ఆంత్రాక్స్ వల్ల జరిగినవి కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆంత్రాక్స్ లక్షణాలున్న పశువులను తినడం వల్ల వ్యాధి సోకినట్టు అప్పట్లో అనుమానించారు. ఆంత్రాక్స్ గురించి అంతా మరిచిపోతున్న తరుణంలో ఇప్పుడు తాజాగా హుకుంపేట మండలంలో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆ మండలంలోని తాడిపుట్టు పంచాయతీ ఉర్రాడ, బొడ్డాపుట్టు, నిమ్మలపాడు గ్రామాల్లో కొందరికి ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించడం కలవరపెడుతోంది. ఉర్రాడకు చెందిన సీదరి లక్ష్మయ్య(45), నిమ్మలపాడుకు చెందిన సీదరి సన్నిబాబు (45), మాతె బొంజుబాబు (56), బొడ్డాపుట్టు గ్రామానికి చెందిన పాడి స్వామినాయుడు (45), తూబూరు మత్య్సరాజు (45) ఆంత్రాక్స్ లక్ష ణాలతో బాధపడుతున్నారు. వీరి ఎడమ కాలు, ఎడమ చేతులపై మాత్రమే ఆంత్రాక్స్ను పోలిన పుండ్లు ఏర్పడ్డాయి. నొప్పి, దురద లేకుండా చెయ్యిపై మచ్చలు, ఆపై పుండ్లుగా మారడంతో వైద్య నిపుణులు ఆంత్రాక్స్గానే అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా శనివారం ఆయా గ్రామాల్లోని వ్యాధిగ్రస్తులకు వైద్యాధికారి విశ్వేశ్వరరావు నాయుడు శనివారం ప్రాథమిక వైద్యం అందించారు. వీరిని సోమవారం విశాఖ కేజీహెచ్‌కు తరలించనున్నారు.