మళ్లీ ఆంత్రాక్స్ బూచి
- పదకొండేళ్ల క్రితం వెలుగులోకి..
- 2009లో 11 మంది మృత్యువాత
- తాజాగా హుకుంపేటలో లక్షణాలు
సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో ఆంత్రాక్స్ వ్యాధి వెలుగు చూసి సరిగ్గా పదకొండేళ్లయింది. ఆ తర్వాత ఐదారేళ్ల కోసారి నేనున్నానంటోంది. మన్యం వాసులను తరచూ భయకంపితులను చేస్తోంది. తాజాగా హుకుంపేట మండలంలో మూడు గ్రామాల్లో ఐదుగురు గిరిజనులకు ఆంత్రాక్స్ లక్షణాలు వెలుగు చూడడం ఇటు మన్యం ప్రజలను, అటు అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. 2004 సెప్టెంబర్‌లో అరకులోయ మండలం పెదలబుడులో తొలిసారిగా ఆంత్రాక్స్ కేసు బయట పడింది. ఆ మరుసటి సంవత్సరం జూన్ 18న అదే మండలం భీముడివలసలో ఆరుగురు (నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు) గిరిజనులకు ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు.
అప్పట్లో వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించి వైద్య చికిత్స అందించడంతో కోలుకున్నారు. పది రోజులు నిల్వ ఉంచిన మేక మాంసాన్ని తినడం వల్ల ఆంత్రాక్స్ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ 2009 మే నెలలో ముంచంగిపుట్టు మండలం కర్లపొదూరు, అత్తికల్లు, ఆదర్లడి, ముచ్చిపుట్టు, పిల్లగండువ , లక్ష్మీపురం, బరడ తదితర గ్రామాల్లో పలువురు గిరిజనుల్లో ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. అప్పట్లో సుమారు 60 మంది రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో 11 మందికి ఆంత్రాక్స్ లక్షణాలున్నట్టు తేలింది. మన్యంలో ఆంత్రాక్స్ అలజడిపై ఢిల్లీ నుంచి వైద్య నిపుణుల బృందం కూడా వచ్చి ఆయా ప్రాంతాల్లో పరిశీలించి వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత ఆంత్రాక్స్ లక్షణాలతో ఆయా గ్రామాల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఆ మరణాలు ఆంత్రాక్స్ వల్ల జరిగినవి కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆంత్రాక్స్ లక్షణాలున్న పశువులను తినడం వల్ల వ్యాధి సోకినట్టు అప్పట్లో అనుమానించారు.
ఆంత్రాక్స్ గురించి అంతా మరిచిపోతున్న తరుణంలో ఇప్పుడు తాజాగా హుకుంపేట మండలంలో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆ మండలంలోని తాడిపుట్టు పంచాయతీ ఉర్రాడ, బొడ్డాపుట్టు, నిమ్మలపాడు గ్రామాల్లో కొందరికి ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించడం కలవరపెడుతోంది. ఉర్రాడకు చెందిన సీదరి లక్ష్మయ్య(45), నిమ్మలపాడుకు చెందిన సీదరి సన్నిబాబు (45), మాతె బొంజుబాబు (56), బొడ్డాపుట్టు గ్రామానికి చెందిన పాడి స్వామినాయుడు (45), తూబూరు మత్య్సరాజు (45) ఆంత్రాక్స్ లక్ష ణాలతో బాధపడుతున్నారు. వీరి ఎడమ కాలు, ఎడమ చేతులపై మాత్రమే ఆంత్రాక్స్‌ను పోలిన పుండ్లు ఏర్పడ్డాయి. నొప్పి, దురద లేకుండా చెయ్యిపై మచ్చలు, ఆపై పుండ్లుగా మారడంతో వైద్య నిపుణులు ఆంత్రాక్స్‌గానే అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా శనివారం ఆయా గ్రామాల్లోని వ్యాధిగ్రస్తులకు వైద్యాధికారి విశ్వేశ్వరరావు నాయుడు శనివారం ప్రాథమిక వైద్యం అందించారు. వీరిని సోమవారం విశాఖ కేజీహెచ్‌కు తరలించనున్నారు.