రుయాలో చికిత్స పొందుతున్న ఆనందయ్యను పరిశీలిస్తున్న వైద్య బందం
చిత్తూరు, తిరుపతి (అలిపిరి)/కార్వేటినగరం: కార్వేటినగరం మండలం కోదండరామపురం దళితవాడలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టించింది. ఏడుగురికి బొబ్బలు ఏర్పడడంతో ఇక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల గ్రామంలో 25 పాడి పశువులు, గొర్రెలు, మేకలు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. మృతి చెందిన పశుమాంసాన్ని తినడంతో వ్యాధి లక్షణాలు బయటపడినట్లు తెలిసింది. బాధితులను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరుగురికి చికిత్స అందజేసి ఇంటికి పంపించారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ రవిరాజు ఒకరికి వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతి రుయాకు తరలిం చారు. ఇతడి రక్తనమూనాలను సేకరించి రుయా పరీక్షల విభాగానికి పంపారు. సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు డాక్టర్ ఆర్‌ఆర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ చినబాబు అత్యవసర విభాగానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి నివేదికలో అది సెరిబ్రల్ మలేరియాగా తేలింది. వదంతలు నమ్మవద్దని సూచించారు.
గ్రామంలో వైద్య శిబిరం
రెండు దశాబ్దాల క్రితం ఇదే మండలం టీకేఎం పేటలో 85 మందికి ఆంత్రాక్స్ సోకింది. ఆ సమయంలో డాక్టర్ రవిరాజు కార్వేటినగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేశారు. స్థానికుడు కావడంతో తాజాగా కోదండరామాపురంలో వ్యాధి ప్రబలిన విషయం తెలు సుకున్నారు. శుక్రవారం జేడీ వెంకట్రావు, ఎంపీడీఓ వెంకటరత్నమ్మ జిల్లా వైద్యబృందంతో పాటు ఈయన వెళ్లి పరిశీలించారు. ఈ వ్యాధిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పశుమాంసాలు నిల్వ ఉంచిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. గ్రామానికి దూరంగా మాంసాన్ని పూడ్చి వేయాలని అధికారులు ఆదేశించారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు.
అమరావతి నుంచి కలెక్టరు సమీక్ష..
ఆంత్రాక్స్ వదంతులను ప్రజలు నమ్మవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంత్రాక్స్ అనుమానిత కేసులపై అమరావతి కలెక్టర్ల సదస్సు నుంచి జేసీ గిరీషా, పశుసంవర్థక జేడీ, డీఎంహెచ్‌వో, రుయా సూపరింటెండెంట్‌లతో కలెక్టర్ సమీక్షించారు. ఒకరు మాత్రం రుయాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment