అనుష్క మోజులో పటన్ పతనం | Anushka blowing the fall of Patan | Sakshi
Sakshi News home page

అనుష్క మోజులో పటన్ పతనం

Published Tue, Aug 19 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

అనుష్క మోజులో పటన్ పతనం

అనుష్క మోజులో పటన్ పతనం

పోలీసుల చేతికి  మిలటరీ  రహస్య పత్రాలు
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫేస్‌బుక్‌ల నుంచి 104 రహస్య పత్రాలు వెలికి  
అనుష్క అగర్వాల్‌పై కేసు నమోదు
చంచల్‌గూడ జైలుకు పటన్ తరలింపు
త్వరలో మార్షల్ కోర్టుకు పంపే అవకాశం

 
 హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్.. పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్(అనుష్క అగర్వాల్)కు పంపిన మిలటరీ రహస్య పత్రాలు సీసీఎస్ పో లీసుల చేతికి చిక్కాయి. ఏడాది కాలంగా ఆమెకు 104 పేజీల రహస్యాలను పంపినట్లు తేలింది. సోమవారం పటన్ కస్టడీ ముగియడంతో నాంప ల్లి కోర్టు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో పలు నిజాలు వెలుగు చూశాయి. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ నెల 12న కస్టడీకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు పటన్‌ను విచారించి మరిన్ని రహస్యాలను కక్కించారు.

వెలుగు చూసిన నిజాలు..

దేశంలోని 12 ఆర్మీ యూనిట్ల ప్రాంతాలు, సైనికాధికారుల పేర్లు, ఏయే యూనిట్లో ఏయే ఆయుధాలు ఎక్కడెక్కడ ఉంటాయనే విషయాలను పటన్ పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్‌కు అందించాడు. సైనికాధికారుల సమావేశాల సర్క్యులర్ కాపీలను సైతం ఆమెకు పంపినట్లు తేలింది. పటన్ నుంచి నాలుగు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, బ్లూ టూత్, మూడు సెల్‌ఫోన్లు, నాలుగు పెన్‌డ్రైవ్‌లు, 10 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు డీ కోడ్ చేసి రికవరీ చేశారు. రికవరీ పత్రాలు, ఫొటోలను పంపినట్టు పటన్ అంగీకరించాడు. ఆర్మీ యూనిట్లు, అధికారుల సమావేశాల ఫొటోలు, మిస్సైల్ ఫొటోలు ఇందులో ఉన్నాయి. ఆర్మీ మిస్సైల్స్ నిల్వ కర్మాగారాలు, మిలటరీ అధికారుల రహస్య సమావేశాలు, వాటి ఎజెండా గురించి కూడా పటన్ తన ఈ-మెయిల్, ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు పంపించాడు. దేశ సరిహద్దులో ఏ సెక్టార్‌లో ఎంత మంది ఉంటారు, వారు ఎన్ని రోజులకు మారుతుంటారు, కొత్తగా వచ్చే బృందాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేవాడు. సైనిక రహస్యాలు పంపినందుకు అనుష్క తనకు రూ.74 వేలు పలు దఫాలుగా బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసిందని పటన్ విచారణలో వెల్లడించాడు. చైనాలో ఉండే విదేశీ రాయబార కార్యాలయంలో ధరమ్‌వీర్ సింగ్, మాజీ సుబేదార్ బి.ఎస్.రెడ్డిల ద్వారా విదేశాల్లో తాను స్థాపించిన ఎంఎల్‌ఎం సెక్యూర్డ్ లైఫ్ సంస్థకు వ్యాపారం చేయించి లాభాలు ఆర్జించి పెడతానని, లండన్‌కు కూడా పంపిస్తానని అనుష్క తనను నమ్మించిందని వెల్లడించాడు. అత్యంత క్రమశిక్షణకు మారుపేరైన మిలటరీలో పనిచేస్తున్న తాను అనుష్క మోజులో పడి మోసపోయానని అతడు అంగీకరించాడు. తాను రహస్యాలు పంపకపోతే ఆమె తనను బ్లాక్‌మెయిల్ చేసి ఉండేదని, అందుకు భయపడి సహకరించానని విచారణాధికారులకు చెప్పాడు. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని పేర్కొన్నాడు. పటన్ పాక్‌కు పంపిన రహస్యాల కాపీలను నగర పోలీసులు కేంద్ర రక్షణ రంగ అధికారులకు పంపారు. చంచల్‌గూడ జైలులో ఉన్న పటన్‌ను త్వరలో మిలటరీ మార్షల్ కోర్టులో హాజరు పర్చేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు.

దిద్దుబాటు చర్యలు

దేశ సైనిక రహస్యాలు పాక్‌కు చేరడంతో కలవరపడ్డ ఆర్మీ అధికారులు దిద్దుబాటు చర్యలో నిమగ్నమయ్యారు. పాక్‌కు చేరిన రహస్యాలు ఏంటనే విషయంపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో తమ మిస్సైల్ ఆయుధాగారాన్ని బదిలీ చేయాలని, ఉన్నతాధికారుల రహస్య మందిరాలను కూడా మార్చాలని భావిస్తున్నారు. రహస్యాలు బయటకు పోకుండా అధికారుల వద్ద ఉన్న కంప్యూటర్లను చిన్న ఉద్యోగులు వాడకుండా చూడాలని సూచించారు. పాక్‌కు చేరిన రహస్యా లు పనికిరాకుండా చేసేందుకు చర్యలను మొద లు పెట్టాలని ఆర్మీ వర్గాలు యోచిస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement