సాక్షి, హైదరాబాద్: రైతులకు భూమి, నీరు, క్రిమిసంహారక మందులు, మార్కెటింగ్ చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు పిలుపునిచ్చారు. రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 176 పారా లీగల్ వలంటీర్లను నియమించిందని వెల్లడించారు. గ్రామీణ భవితకు వలంటీర్లు మార్గదర్శకులు కావాలన్నారు. సాగు చట్టాలపై వలంటీర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నల్సార్ యూనివర్సిటీలో బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జస్టిస్ నవీన్‌రావు మాట్లాడుతూ.. ‘దేశంలోని రైతుల్లో పేద, మధ్య తరగతి వారే ఎక్కువ. వారికి చట్టాలపై అవగాహన తక్కువ. న్యాయం పొందడం వారి హక్కే అయినా కోర్టులకు వెళ్లి దాన్ని పొందాలంటే ఆర్థిక భారంతో కూడిన పని. కోర్టు గ్రామ స్థాయికి వెళ్లి న్యాయం అందించలేని పరిస్థితి. అందుకే ఇలాంటి వారి కోసం న్యాయ సేవా సంస్థలు ఆవిర్భవించాయి. వారికి న్యాయసేవలు అందించడమే వలంటీర్ల బాధ్యత. దీని కోసం పుట్టిందే ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’. బమ్మెరలో రెండు నెలల క్రితం ప్రారంభించాం.
ఇప్పుడు 67 ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండు రోజుల పాటు జరిగే శిక్షణలో మీకు తెలియనివి నిపుణుల నుంచి తెలుసుకోండి. ప్రతీ చిన్న విషయానికి కోర్టులను ఆశ్రయించకుండా.. గ్రామీణ స్థాయిలో పరిష్కారం అయ్యేలా చూడాలి. మీరు పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు మండల, జిల్లా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చు’అని సూచించారు.
వారియర్లలా పని చేయాలి...
సత్వర న్యాయం అందించేందుకు వలంటీర్లు వారియర్లలా పనిచేయాలని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీకృష్ణదేవరావు సూచించారు. పూర్వం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ‘మధ్యవర్తిత్వం’సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. లీగల్ సర్విసెస్ అథారిటీ చట్టాలు, పథకాలపై వలంటీర్లకు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ(టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ విద్యుల్లత, లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, రిసోర్స్ పర్స న్లు, ట్రైనీ పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment