► ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం
► పలు కీలక తీర్మానాలు అమోదం
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గురువారమిక్కడ ముగిసింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. విజయవాడ మెట్రోకు రుణ పరిమితి పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,175 హడ్కో రుణం తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ జిల్లా అచ్చుతాపురంలో బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, సాగునీటి సంఘాలకు ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహించడం, రేషన్ షాపుల్లో చక్కెర పంపిణీ ఆపాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గ నిర్ణయాలు:
⇒ విశాఖ జిల్లా అచ్యుతాపురంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అచ్చుతాపురం, రాంబిల్లి మండలల్లో సుమారు2,884.66 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది.
⇒ విజయవాడ మెట్రోకార్పోరేషన్‌కు రుణ పరిమితిని రూ.1859కోట్లనుంచి రూ.2,175కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రుణాన్ని మెట్రో కార్పోరేషన్ హడ్కోనుంచి తీసుకోనుంది.
⇒ ఆంధ్రప్రదేశ్ సాగనీటి సంఘాలకు ఆరేళ్లు ఉన్న కాలపరిమితిని ఐదేళ్లకు కుదించింది. అంతేకాకుండా మహారష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మాదిరి ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు నిర్వహించాలని తీర్మనించింది.
⇒ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు 2014లోని షెడ్యూల్డ్ 9కింద ఉన్నబీసీ ఫెడరేషన్లకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఆస్తులు అప్పుల పంపకాలపై డాక్టర్ షీలా భీగే కమిటీ సిఫార్సులను ఆమెదిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
⇒ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించుకునేందుకు అవసరమైన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్3, 2006లో సవరణల డ్రాఫ్ట్ ఆర్డినెన్స్‌ను మంత్రిమండలి ఆమోదించింది.