Vijayawada metro
-
విజయవాడ మెట్రోపై వెనుకడుగు
మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కేవలం 12 కిలోమీటర్ల దూరం కోసం రూ.ఏడు వేల కోట్ల వ్యయంతో మెట్రో రైలు అవసరమా అనే దానిపై బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మెట్రోతోపాటు పలు అంశాలపై చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మెట్రో లైను కంటే ఈ 12 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలోనూ రెండు లేయర్ల బ్రిడ్జిని నిర్మిస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే తరహాలో మెట్రో బదులు రెండు లేయర్ల ఫ్లైఓవర్ నిర్మిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రుణ పరిమితిని రూ.1859 కోట్ల నుంచి రూ.2,175 కోట్లకు పెంపుపై చర్చ జరిగినప్పుడు చంద్రబాబు అసలు ఈ ప్రాజెక్టు అనవసరమని అభిప్రాయపడినట్లు తెలిసింది. రెండు మెట్రో కారిడార్ల స్థానంలో రెండు లేయర్ల బ్రిడ్జి నిర్మిస్తే ఎలా ఉంటుంది, ఎంత ఖర్చవుతుందనే దానిపై ప్రతిపాదనలు తీసుకు రావాలని పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. విశాఖలో కారిడార్ల దూరం ఎక్కువ కాబట్టి అక్కడ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించి, విజయవాడలో మాత్రం విరమించుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం రూ.కోటను ఖర్చు పెట్టడంతోపాటు భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పించి, టెండర్లు పిలిచి, ప్రత్యేకంగా దానికోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అనవసరమనే ఆలోచనకు రావడం గమనార్హం. మొదటి నుంచి విజయవాడకు మెట్రో అవసరం లేదని రవాణా రంగ నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం కోట్లు కుమ్మరించిన తర్వాత మేల్కొని పునరాలోచన చేయడం విశేషం. వెంటనే కౌంటర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం రేషన్ సరుకుల జాబితా నుంచి చక్కెరను తొలగిస్తుండడంతో దాని బదులు రాష్ట్ర ప్రభుత్వం వేరైనా ఏదైనా వస్తువు ఇస్తే ఎలా ఉంటుందనే అంశం సమావేశంలో చర్చకొచ్చింది. నీరు–ప్రగతి కార్యక్రమాన్ని మంత్రులు సీరియస్‌గా తీసుకోవడంలేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు వాటిపై వెంటనే కౌంటర్ ఇవ్వడంలేదని, దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పినట్లు తెలిసింది. వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారు. తాను అడిగిన వెంటనే సమాచారం ఇవ్వాలని లేకపోతే సంబంధిత శాఖాధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. -
విశాఖ జిల్లాలో బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్
► ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం ► పలు కీలక తీర్మానాలు అమోదం అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గురువారమిక్కడ ముగిసింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. విజయవాడ మెట్రోకు రుణ పరిమితి పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,175 హడ్కో రుణం తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ జిల్లా అచ్చుతాపురంలో బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, సాగునీటి సంఘాలకు ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహించడం, రేషన్ షాపుల్లో చక్కెర పంపిణీ ఆపాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలు: ⇒ విశాఖ జిల్లా అచ్యుతాపురంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అచ్చుతాపురం, రాంబిల్లి మండలల్లో సుమారు2,884.66 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. ⇒ విజయవాడ మెట్రోకార్పోరేషన్‌కు రుణ పరిమితిని రూ.1859కోట్లనుంచి రూ.2,175కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రుణాన్ని మెట్రో కార్పోరేషన్ హడ్కోనుంచి తీసుకోనుంది. ⇒ ఆంధ్రప్రదేశ్ సాగనీటి సంఘాలకు ఆరేళ్లు ఉన్న కాలపరిమితిని ఐదేళ్లకు కుదించింది. అంతేకాకుండా మహారష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మాదిరి ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు నిర్వహించాలని తీర్మనించింది. ⇒ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు 2014లోని షెడ్యూల్డ్ 9కింద ఉన్నబీసీ ఫెడరేషన్లకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఆస్తులు అప్పుల పంపకాలపై డాక్టర్ షీలా భీగే కమిటీ సిఫార్సులను ఆమెదిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ⇒ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించుకునేందుకు అవసరమైన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్3, 2006లో సవరణల డ్రాఫ్ట్ ఆర్డినెన్స్‌ను మంత్రిమండలి ఆమోదించింది. -
తుళ్లూరుకూ మెట్రో!
* కొత్త రాజధానికి విజయవాడ మెట్రోను విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు * రెండో దశలో దీన్ని అమలు చేయాలనే యోచనలో అధికారులు * రాజధాని మాస్టర్ ప్లాన్ ఖరారయ్యాక మెట్రో విస్తరణపై స్పష్టత సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును రెండో దశలో నూతన రాజధాని తుళ్లూరు ప్రాంతానికి విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో చేపట్టే రెండు కారిడార్లు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచే రాజధాని ప్రాంతానికి లింకు కలపాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అందులోభాగంగా బస్టాండ్ ప్రాంతం నుంచి తాడేపల్లి వరకూ కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించనున్నారు. అక్కడి నుంచి సీతానగరం కొండ చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించి తుళ్లూరు ప్రాంతానికి ఆ కారిడార్‌ను విస్తరించాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్ కంపెనీలు రాజధాని మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తున్న నేపథ్యంలో అది వచ్చిన తర్వాత ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చేపట్టిన తొలి దశ మెట్రో ప్రాజెక్టు సవివర నివేదికను మార్చి నాటికి పూర్తిచేసిన అనంతరం మాస్టర్‌ప్లాన్‌ను బట్టి రాజధాని మెట్రో సవివర నివేదిక తయారీని ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఏలూరు రోడ్డు కారిడార్ పొడిగింపు విజయవాడ నగరంలోని తొలివిడతలో ప్రతిపాదించిన 13 కిలోమీటర్ల ఏలూరు రోడ్డు కారిడార్‌ను రెండో దశలో ఏడు కిలోమీటర్లు పెంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ విస్తరించనున్నారు. రెండో దశలో బెస్ట్‌ప్రైస్ షోరూమ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ దీన్ని విస్తరిస్తారు. మెట్రో రైలు ద్వారా విజయవాడను రాజధానికి అనుసంధానించినా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలుపుతూ రాజధాని ప్రాంతానికంతటికీ ఈ నెట్వర్క్ ఉపయోగపడేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో విజయవాడ మెట్రో స్టేషన్ల సర్వే విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సంబంధిం చిన సవివర నివేదికలో భాగంగా నిర్వహిస్తున్న టోపోగ్రాఫికల్ సర్వే దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలో రెండు కారిడార్లలో నిర్మించే మెట్రో రైల్వే స్టేషన్ల టోపోగ్రఫీ సర్వేను ప్రారంభించడానికి ఈ పనులు చేపట్టిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన కన్సల్టెన్సీ ప్రతిపాదనలను పంపింది. మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ వీటికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ అనుమతి రాగానే సర్వే ప్రారంభించనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో భూసార పరీక్షలను కూడా ప్రారంభించనున్నారు.